శర్వానంద్ గారి ఈవెంటుకు అతిథి బన్నీగారు??

0

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రణరంగం’ ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగష్టు 4 వ తారీఖున కాకినాడలో జరిపేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది.

కారణం ఏంటంటే ‘రణరంగం’ నిర్మాతలు.. అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ సినిమా నిర్మాతలు ఒకరే. అల్లు అర్జున్ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలోనే జరుగుతోందట. మరో రెండువారాల పాటు షూటింగ్ అక్కడే జరుగుతుందని సమాచారం. దీంతో ‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. త్రివిక్రమ్ కూడా బన్నీతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని తీసిపారేయలేమని టాక్.

గతంలో శర్వానంద్ సినిమా ‘పడి పడి లేచే మనసు’ ఈవెంట్ కు అల్లు అర్జున్ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్లో ‘గారు’ పదం పై బన్నీ గారు చేసిన హితబోధ ఎవరూ మర్చిపోలేరు. ఇతరులను ‘గారు’ అని గౌరవించడం కరెక్టే కానీ అరే ఒరే అనే చనువు ఉన్న ఫ్రెండ్స్ ను కూడా ‘గారు’అని సంబోధించడం ఎబ్బెట్టుగా ఉంటుందని చాలామంది నెటిజన్లు బన్నీగారిపై సెటైర్లు వేశారు. మరి ‘రణరంగం’ ఈవెంట్ లో బన్నీగారి స్పీచ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఒకవేళ అక్కడ త్రివిక్రమ్ గారు ఉంటే ఆయనగారు ఎలా స్పందిస్తారో.. ఇవన్నీ చూసి డైరెక్టర్ సుధీర్ వర్మ గారు.. హీరో శర్వానంద్ గారు ఎలా రియాక్ట్ అవుతారో!
Please Read Disclaimer