సుకుమార్..ఏ సీన్ తీయాలి? ఏ డైలాగ్ పెట్టాలి?

0

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ది ప్రత్యేకమైన శైలి. ప్రతి షాట్ లో – ప్రతి సన్నివేశంలో – ప్రతి డైలాగ్ లో – ప్రతి పాటలో – ప్రతి ఫైట్ లో ఏదో ప్రత్యేకకత చూపించాలని తపించే దర్శకుడాయన. తెర మీద మ్యాజిక్ చేసే ఆయన.. అంతకంటే ముందు రైటింగ్ టేబుల్ దగ్గర విపరీతంగా కష్టపడతాడని.. తన టీం సభ్యుల్ని కూడా చాలా కష్టపెడతాడని అంటారు. సుక్కుకు ఏదీ ఒక పట్టాన నచ్చదని.. ఒకసారి లాక్ అయిన సన్నివేశాన్ని – డైలాగ్ ను కూడా ఇంకా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడని.. షూటింగ్ స్పాట్ లో కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతుంటారు. దీని గురించి నాన్నకు ప్రేమతో సినిమాకు పని చేసిన సందర్భంగా ఎన్టీఆర్ కూడా ప్రస్తావించాడు. పర్ఫెక్షన్ కోసం సుక్కు అంత తపిస్తాడు కాబట్టే ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా క్లాసిక్స్ అనిపించుకున్నాయి.

మామూలుగానే ఎంతో శ్రమించే సుకుమార్.. రంగస్థలం లాంటి రికార్డ్ బ్రేకింగ్ – క్లాసిక్ మూవీ తర్వాత తనపై పెరిగిన అంచనాల్ని అందుకునేందుకు మరింతగా కష్టపడ్డాడట. అల్లు అర్జున్ తో చేయబోయే తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్టు మీద దాదాపు ఏడాదిన్నర పని చేశాడు సుక్కు. ఈ చిత్రానికి అరడజను మందికి పైనే రచయితలు పని చేశారు. వాళ్లతో కలిసి సుక్కు.. మథించి మథించి స్క్రిప్టును ఓ రేంజిలో తీర్చిదిద్దాడని.. ఒక్కో సన్నివేశం కోసం అరడజను వెర్షన్లు రాయించాడని.. డైలాగులు కూడా అలాగే తయారు చేశాడని.. వీటిలో ఏ సీన్ పెడతాడో.. ఏ డైలాగ్ చెప్పిస్తాడో సెట్స్ మీదికి వెళ్లాక కూడా తెలియదని.. అప్పటికి ఆయన ఆలోచన మారి కొత్త సీన్ – కొత్త డైలాగ్ పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన టీం సభ్యులు చెబుతుండటం విశేషం. ఐతే ఏ సీన్ తీసినా – ఏ డైలాగ్ పెట్టినా.. ఈసారి రంగస్థలంకు ఏమాత్రం తగ్గని సినిమా సుక్కు నుంచి రాబోతోందన్నది ఆయన టీం చెబుతున్న మాట.
Please Read Disclaimer