పెళ్లాం ముందు వచ్చే హీరోయిజం గొప్పతనాన్ని భలే చెప్పాడుగా?

0

ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎదుటోడు ఏమనుకుంటాడన్నది పట్టకుండా.. తాను చెప్పాలనుకున్నది సూటిగా.. సుత్తి లేకుండా.. చాలా స్పష్టతతో దమ్ముగా చెప్పే అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. మిగిలిన వారితో పోలిస్తే కాస్త.. అగ్రెసివ్ నెస్ ఎక్కువే. బయటోళ్లు.. సొంతోళ్లు.. ఇలా ఎవరిని కేర్ చేయని నేచర్ అతని మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. సినిమా నటుల్లో.. ఆ మాటకు వస్తే పేరున్న నటుల్లో తరచూ కనిపించే ఒద్దిక బన్నీలో పెద్దగా కనిపించదు. నచ్చింది చేస్తా.. అనిపించింది చెప్పేస్తా అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి.

విషయం ఏదైనా.. దాన్ని ఒప్పేసుకునే విషయంలో పెద్ద పట్టింపులు బన్నీలో అస్సలు కనిపించవు. అలాంటి నేచర్ ఉన్న బన్నీ.. తాజాగా తన సినిమా మ్యూజికల్ నైట్ ఫంక్షన్ లో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చాలామంది హీరోలు చెప్పని అనే కన్నా.. టచ్ చేయని ఒక మాటను చెప్పేసి.. దటీజ్ అల్లు అర్జున్ అనేలా చేశాడని చెప్పాలి.

అల వైకుంఠపురము చిత్రంలోని పాటలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మాటకు వస్తే.. ఈ సినిమా ఎలా ఉన్నా.. సామజవరగమన పాట ఎలా ఉంటుందో చూసేందుకైనా ఒకసారి మూవీ చూడాలని ఫిక్స్ అయినోళ్లు ఎంతోమంది ఉన్నారు. అలా ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

అల వైకుంఠపురము చిత్రంలోని పాటలు ఇంత సంచలనంగా మారతాయని తాముఅస్సలు అనుకోలేదని చెప్పారు అల్లు అర్జున్. ఎక్కడికెళ్లినా నీ పాటలే వినిపిస్తున్నాయని తన భార్య చెప్పిందన్న బన్నీ.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కంటే పెళ్లాం ముందు వచ్చే హీరోయిజం గొప్పగా ఉంటుందని చెప్పి.. అమ్మాయిల మనసుల్ని గెలిచేశారు అల్లు అర్జున్.
ఆ మాటకు వస్తే.. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నా.. ఎవరూ కూడా తమ భార్యల గురించి అల్లు అర్జున్ మాదిరి ఓపెన్ డయాస్ మీద ఇంతలా పొగిడింది లేదని చెప్పక తప్పదు. నిజమే.. ఎవడెంత సాధించినా.. ఇంటికి వెళ్లినంతనే.. మీరు మొనగాడండి అన్నట్లుగా భార్య ట్రీట్ చేస్తుంటే.. ఆ కిక్కే వేరు. బన్నీ చెప్పిన మాటల్లో నూటికి నూటయాభై శాతం నిజముందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer