సూపర్ స్టార్ రూటులో స్టైలిష్ స్టార్!

0

ఒక సినిమాను ప్రజలకు చేరువ చేసేందుకు ఫిలింమేకర్లు ప్రమోషన్స్ పై ఆధారపడతారు. పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్.. లిరికల్ సాంగ్స్.. వీడియో సాంగ్స్ అంటూ సోషల్ మీడియాలో.. టీవీ ఛానెల్స్ లో ప్రచారం చేపడతారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. హీరో హీరోయిన్లు దర్శకులు కూడా స్వయంగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. టీవీ షోలలో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తారు. గతంలో మన స్టార్ హీరోలు పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనే వారు కాదు.. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా స్టార్ హీరోలు కూడా స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు ఈమధ్య తన సినిమాలకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడని అంటున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మొదటి నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడంపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఈసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మాత్రం రూటు మార్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. ఈమధ్యే జాతీయ మీడియాతో కూడా అల్లు అర్జున్ ముచ్చటించారు. త్వరలోనే తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారట. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మంచి బజ్ ఉంది. రిలీజ్ లోపు మరింతగా హైప్ పెంచేందుకు ఇంటర్వ్యూలు ఇస్తారట. రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ భారీ స్థాయలోనే ప్లాన్ చేశారట.

ఇదంతా చూస్తుంటే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి ప్రమోషన్స్ విషయంలో తగ్గకూడదని అల్లు అర్జున్ టీమ్ డిసైడ్ అయినట్టే అనుకోవాలి. ఈ ప్రమోషన్స్ కు తగ్గట్టే కంటెంట్ కూడా ఉంటే సినిమా భారీ విజయం సాధించడం ఖాయమే అనుకోవచ్చు.
Please Read Disclaimer