భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. వేదికపైనే కంటతడి

0

‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్ (ప్రీ రిలీజ్ ఈవెంట్)లో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. వేదిక కింద ఉన్న అల్లు అరవింద్ పైకి వెళ్లి కుమారుడిని ఓదార్చారు. దగ్గరకు తీసుకొని వెన్నుతట్టారు.

‘‘నన్ను లాంచ్ చేసింది మా నాన్నగారు. ఇప్పటి వరకు నేను 20 సినిమాలు చేశాను. వాటిలో ఏడో ఎనిమిదో ఆయన నిర్మించారు. ఆయనకు ఏనాడూ నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ చెబుతున్నాను.. థాంక్యూ డాడీ’’ అని తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. ‘‘థాంక్యూ అనేది కేవలం తనతో సినిమా తీసినందుకు కాదు’’ అని బన్నీ అనగానే ఆయన గొంతులో వణుకు మొదలైంది. ఆటోమేటిక్‌గా ఏడుపు వచ్చేసింది.

‘‘కొడుకు పుట్టిన తరవాత నాకో విషయం అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పోడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. మా నాన్నలో నేను సగం అయితే చాలు అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడూ నాకు. ఈ ప్రపంచంలో మా నాన్న కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఆయనతో ఈ విషయం చెప్పడానికి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. డాడీ ఐ లవ్ యూ అని చెప్పడానికి ఇదే నాకు మంచి అవకాశం. నేనెప్పుడూ చెప్పలేదు నీకు.. థాంక్యూ థాంక్యూ’’ అంటూ ఏడుస్తూ చెప్పారు అల్లు అర్జున్.

తాను ఫస్ట్ సినిమా ‘ఆర్య’ చేసినప్పుడు సంపాదించిన మొత్తం కోటి రూపాయలని చెప్పారు బన్నీ. అప్పటికి తన వయసు 20 నుంచి 21 సంవత్సరాలు ఉంటుందన్నారు. ‘‘నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. జేబులోకి సొంత డబ్బు వచ్చిన తరవాత అస్సలు లేదు. నాకు పెళ్లయిన తరవాత మా ఆవిడని ఒకే విషయం అడిగాను. నాకు ఇన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్నవాళ్ల ఇంట్లో ఉంటాను నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంతిష్టం’’ అంటూ తండ్రిపై ఉన్న ప్రేమను బన్నీ చాటుకున్నారు.
Please Read Disclaimer