ఎవరినో పిలిచి బాస్ స్థాయిని తగ్గించొద్దని!

0

సంక్రాంతి పోరు నువ్వా నేనా? అన్నట్టుగానే ఉంది. ఎట్టకేలకు రిలీజ్ తేదీలు ఫిక్సయ్యాయి. గిల్డ్ పరిష్కారం చూపడంతో ముందే ప్రకటించిన తేదీలకే బన్ని- మహేష్ ఫిక్సయ్యారు. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న.. అల వైకుంఠపురములో జనవరి 12న వచ్చేస్తున్నాయి. ఇక ప్రీరిలీజ్ వేడుకలపైనా అభిమానుల ఫోకస్. ఏ వేడుకకు ఏ స్టార్ వస్తున్నారు? ఎవరు ముఖ్య అతిధి? అన్న చర్చా అభిమానుల్ని వేడెక్కిస్తోంది.

అయితే జనవరి 5న హైదరాబాద్ లో జరగనున్న మహేష్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. అనీల్ రావిపూడి టీమ్ తెలివిగా ముందే మెగాస్టార్ ని లాక్ చేసేశారు. మహేష్ సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కి ధన్యవాదాలు చెప్పేశారు. ఇక ఈ వేడుకకు వెళుతున్న చిరు ఆ మరుసటి రోజు అంటే జనవరి 6న జరగనున్న అల వైకుంఠపురములో ఈవెంట్ కి కూడా ముఖ్య అతిధిగా హాజరవుతారని.. బన్నికి చిరు మాటిచ్చారని ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. అల.. వేడుకకు మెగాస్టార్ ఎటెండ్ కావడం లేదని తెలుస్తోంది.

దీనిపై బన్నీనే వివరణ ఇచ్చారు. “సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కి బాస్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. ఆయన మీద గౌరవం.. ప్రేమ.. అభిమానం దృష్ట్యా అల వైకుంఠపురములో వేడుకకు ఏ అతిథినీ ఆహ్వానించ వద్దు. ఎవరినో పిలిచి ఆయన స్థాయిని తగ్గించవద్దు..“ అని బన్ని తన దర్శకనిర్మాతల్ని కోరారట. దానికి వారు అంగీకరించారని తెలిసింది. అంటే అల వేదికపై ఇక ఏ ఇతర స్టార్ కనిపించరు. కేవలం అల వైకుంఠపురములో టీమ్ మాత్రమే కనిపిస్తుందన్నమాట.
Please Read Disclaimer