బన్నీ ప్లానింగే వేరబ్బా..

0

అల్లు అర్జున్ తన సినిమా వేడుకలకు ఏ రేంజిలో ప్రిపేరై వస్తాడో అతడి ప్రసంగాల్ని కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. అతను మాట్లాడే మాటల వెనుక ఆంతర్యం చాలానే ఉంటుంది. ఇటీవల అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్తో బన్నీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. తాను ఒంటరిగానే ఈ స్థాయికి వచ్చానని.. తనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని… తాను చాలా గొప్ప అనే ఫీలింగ్ వచ్చేలా అతను మాట్లాడటం తెలిసిందే. కొన్నేళ్లుగా మెగా గొడుగు నుంచి బయటికి వచ్చి సొంత ఇమేజ్ కోసం బన్నీ తాపత్రయ పడుతున్న వైనం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాగే తాను టాలీవుడ్లో ఎవరికీ తీసిపోనని.. మిగతా హీరోలతో పోలిస్తే తన జర్నీ కూడా భిన్నమైందని కూడా బన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా బన్నీ అల వైకుంఠపురములో ప్రమోషన్లలో భాగంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక ఇంటర్వ్యూయర్ బన్నీ మూవీతో పాటు సంక్రాంతికి మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు కూడా వస్తున్న నేపథ్యంలో మహేష్ ను – బన్నీని పోలుస్తూ ఒక ప్రశ్న వేశాడు. మహేష్ కొన్నేళ్లుగా ఒకే రకమైన క్యారెక్టర్లు మంచివాడి పాత్రలు చేస్తున్నాడని చెబుతూ.. మీరు కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న వెరైటీ పాత్రలు చేశారు కదా.. దీనిపై ఏమంటారు అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించడం గమనార్హం. దీనికి బన్నీ బదులిస్తూ.. ఎవరి వ్యక్తిగత ప్రయాణం వాళ్లదని.. ఇద్దరినీ పోల్చడానికి వీల్లేదని.. తమ ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తుండటం వల్ల ఈ పోలిక వచ్చిందని.. మహేష్ తన కంటెంపరరీ అని.. ఆయనపైనే కాక తన తరం హీరోలందరిపైనా తనకు గౌరవం ఉందని అన్నాడు.

ఇంతకుముందు మహేష్ ముందు చిన్న హీరోలా కనిపించిన బన్నీ.. ఇప్పుడు అతడికి పోటీగా తయారైన నేపథ్యంలో బన్నీ మహేష్ను తన సమకాలీన కథానాయకుడిగా చెప్పడం ద్వారా తన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు ఈ జవాబు ద్వారా. రెండు సినిమాలు ఒకేసారి పోటీ పడుతున్నపుడు ఇంటర్వ్యూయర్ ఈ హీరోల జర్నీ గురించి పోల్చి మహేష్ ను తక్కువ చేసేలా బన్నీని ఎక్కువ చేసేలా ప్రశ్న వేయడం.. దానికి బన్నీ ఇచ్చిన జవాబును పరిశీలిస్తే.. ఈ ప్రశ్న కావాలని అడిగించుకుని జవాబిచ్చినట్లుగా అనిపిస్తోంది.
Please Read Disclaimer