బన్నీ-పవన్ ఫ్యాన్స్ ఒక ఎడతెగని యవ్వారం

0

ఏ ముహూర్తాన ‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఆయన అభిమానులు గోల చేస్తుంటే ‘చెప్పను బ్రదర్’ అని కామెంట్ చేశాడో.. అప్పట్నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బన్నీ పెద్ద విలన్ అయిపోయాడు. మెగా ఫ్యామిలీలోనే అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోవడానికి కారణమైంది ఆ కామెంట్. ఆ తర్వాత దీన్ని కవర్ చేయడానికి బన్నీ కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తాను ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేశానో బన్నీ వివరించినా కూడా పవన్ అభిమానుల ఆగ్రహం తగ్గలేదు. గత ఏడాది పవన్కు సపోర్ట్ అవసరమైన సమయంలో బన్నీ ఒకటికి రెండుసార్లు ఆయన్ని కలిసి అభిమానుల్లో అంతరాలు తొలగించే ప్రయత్నం చేయడం కూడా గమనార్హమే. అయినప్పటికీ పరిస్థితేమీ మారలేదని సోషల్ మీడియా ట్రెండ్స్ను బట్టి అర్థమవుతూ ఉంటుంది.

బన్నీని పరీక్షించడానికి పవన్ ఫ్యాన్స్ అతడి వేడుకల్లో పవర్ స్టార్ నినాదాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. బన్నీ వాటిని అవాయిడ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కన్సర్ట్ లో మరోసారి పవన్ అభిమానులు గోల చేశారు. చాలాసేపు పవన్ కోసం నినాదాలు చేస్తూ కనిపించారు. ఒక సందర్భంలో బన్నీ కలుగజేసుకుని అందరి గురించీ మాట్లాడతా అన్నాడు. చివర్లో నినాదాలు పెద్దదయ్యేసరికి.. ఈ పక్క ఎవరో పవర్ స్టార్ కోసం అరుస్తున్నారు.. అంటూ ఒకసారి పవన్ కళ్యాణ్ పేరు పలికి వేరే టాపిక్ కు వెళ్లిపోయాడు. అతను స్పందించిన తీరు ఎటకారంగానే అనిపించింది.

గతంలో ఒకసారి ప్రభాస్ ఇలాగే పవన్ అభిమానులు గోల చేస్తుంటే ఒకసారి పవర్ స్టార్ అనేస్తే పోయే అన్నట్లు మొక్కుబడిగా ఆ పేరెత్తడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు బన్నీ కూడా అదే చేశాడు. అతడి ఎటకారపు స్పందన పవన్ అభిమానులకు కోపం తెప్పించే ఉంటుంది. అయితే ప్రతిసారీ ఇలా నినాదాలు చేయడం.. బన్నీ స్పందించిన తీరును బట్టి అతడి మీద వ్యతిరేకత పెంచుకోవడం సిల్లీగా కనిపిస్తోంది. ఓవైపు పవన్ సీరియస్ గా రాజకీయ ప్రయాణం చేస్తే దాని గురించి ఆలోచించకుండా ఇలా వేడుకల్లో పవన్ పేరెత్తారా లేదా.. ఆయన గురించి మాట్లాడారా లేదా అని సిల్లీ డిస్కషన్లు పెట్టడం వల్ల అయితే ఏ ప్రయోజనం లేదని పవన్ ఫ్యాన్స్ గుర్తిస్తే మంచిది.
Please Read Disclaimer