బన్నీ ఆ మాటలు సీరియస్ గా చెప్పాడట

0

టాలీవుడ్ హీరోల్లో కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలయాళ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ సినిమాలు కేరళలో అత్యధిక థియేటర్లలో విడుదల అవ్వడంతో పాటు ఎక్కువ వసూళ్లను కూడా సాధిస్తున్నాయి. కేరళలో అల్లు అర్జున్ అభిమాన సంఘాలు కూడా ఉన్న విషయం తెల్సిందే. అక్కడ బన్నీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే ఆయన సినిమాల మొదటి రోజు వసూళ్లను ఇతర హీరోల వసూళ్లతో పోల్చితే సరిపోతుంది.

మలయాళి ప్రేక్షకులు తనను అంతగా అభిమానిస్తున్నందుకు గాను ఒక డైరెక్ట్ మలయాళ సినిమా చేయబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెల్సిందే. చాలా మంది హీరోలు తమ సినిమాలు డబ్బింగ్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక డైరెక్ట్ సినిమా చేస్తామంటూ మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా తమిళ హీరోలు చాలా మంది వారి సినిమాలు తెలుగులో డబ్ అయినప్పుడు త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తామంటూ చెబుతూ ఉంటారు. కాని ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించింది లేదు.

అలాగే అల్లు అర్జున్ కూడా ఏదో మాట వరసకు మాత్రమే అలా అని ఉంటాడని.. బన్నీ మలయాళ సినిమా చేయడం అనేది అసాధ్యమని చాలా మంది అనుకున్నారు. కాని బన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి మలయాళ సినిమా గురించి ప్రస్తావించాడు. తాను మలయాళంలో ఒక సినిమా చేసేందుకు కథలు వింటున్నాను. కాని ఇప్పటి వరకు సరైన కథ దొరకలేదు అన్నాడు. కేరళ ప్రేక్షకులకు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ కు అనుసారంగా సినిమాను చేయాలనుకుంటున్నాను. అంతే తప్ప ఏదో ఒకటి చేద్దామనే ఆలోచన లేదు అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.

కాస్త లేట్ గా అయినా ఒక మంచి సినిమాను మలయాళంలో ఖచ్చితంగా చేస్తానని.. వారి అభిమానంను మరింత పొందాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బన్నీ మాటల్లో సిరియస్ నెస్ కనిపిస్తుంది.. ఖచ్చితంగా ఈయన త్వరలోనే మలయాళ సినిమా చేసే అవకాశాలున్నాయనిపిస్తుంది.
Please Read Disclaimer