‘ఆహా’ కోసం అల్లు అర్జున్ వెబ్ సిరీస్ లు..?

0

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ‘ఆహా’ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నిర్వహించబడుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రొడక్షన్ లో తలపండిన అల్లు అరవింద్.. ఇప్పుడు ‘ఆహా’ని ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి ధీటుగా రెడీ చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలుస్తోంది. ‘ఆహా’లో వర్కింగ్ పార్టనర్ గా ఉండటంతో పాటు అన్నింటా తానే ఉంటూ ఈ యాప్ ను ముందుకు నడిస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆహా’కి ఎవరైనా కంటెంట్ అమ్మాలన్నా గీతా ఆర్ట్స్ టీమ్ దగ్గరుండి అంతా చూసుకుంటోందని తెలుస్తోంది. అందుకే ఆహాలో ఈ మధ్య మిగతా ఓటీటీల కంటే కొంత క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ అవుతోంది. సినిమాలు వెబ్ సిరీస్ లతోనే కాకుండా స్పెషల్ టాక్ షోలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమై అక్కినేని సమంత హోస్ట్ గా పెట్టి ‘సామ్ జామ్’ అనే షో చేస్తున్నారు. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొననున్నాడు. ఇప్పుడు ఇదే క్రమంలో ‘ఆహా’ కి క్రేజ్ తీసుకురావడం కోసం అల్లు అర్జున్ ని కూడా రంగంలోకి దింపుతున్నారని సమాచారం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో హీరోగా నటిస్తూనే ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఫ్యామిలీకి కలిసొచ్చిన నిర్మాణ రంగంలోకి ఆయన అడుగుపెట్టనున్నారట. అది కూడా ‘ఆహా’ కోసమని తెలుస్తోంది. బన్నీ నిర్మాతగా మారి ‘ఆహా’లో ఇండిపెండెట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్ లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. బన్నీ టీమ్ ఇప్పటికే పలు కథలు ఓకే చేసినట్లు సమాచారం. ఈ వెబ్ కంటెంట్ కి బన్నీ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ప్రొడ్యూసర్ గా లేదా సమర్పకుడిగా అల్లు అర్జున్ పేరు పడబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ వెబ్ సిరీస్ ప్రొడక్షన్ బడ్జెట్ వ్యవహారాలు ‘ఆహా’ వారు చూసుకున్నా బన్నీ బ్రాండ్ మాత్రం వాటి మీద ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే స్టే ట్యూన్డ్ అంటూ బన్నీ షాడో ఇమేజ్ తో ఓ ప్రోమో కూడా ఆహా టీమ్ రిలీజ్ చేసింది. దీపావళి రోజున బన్నీ వెబ్ సిరీస్ లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.