భరత్ బ్యూటీని బుక్ చేసిన అల్లు బాబీ!

0

ఇంత కాలం వ్యాపారాల్లో ఉన్న అల్లు బాబీ(వెంకటేష్) ఫుల్ టైం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరుణ్ తేజ్ 10వ చిత్రాన్ని సన్నిహితుడితో కలిసి అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వరుణ్ తేజ్ ను ఈ చిత్రంలో బాక్సర్ గా చూడబోతున్నామని సినిమా ప్రారంభంకు ముందే తెలిసి పోయింది. అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ వద్ద వరుణ్ ట్రైనింగ్ తీసుకున్న విషయం కూడా తెల్సిందే.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గద్దలకొండ గణేష్ చిత్రం సక్సెస్ జోరుమీదున్న వరుణ్ తేజ్ ఈ చిత్రంతో మరో సక్సెస్ గ్యారెంటీగా కొడతాడు అంటూ మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. వరుణ్ తేజ్ స్థాయి హీరోయిన్ ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు చాలా చర్చలు జరిగాయట. చివరకు మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ మరియు రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ లో ఈమద్యే ఈమె అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ లో నటించి అక్కడ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు పలు హిందీ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. అయినా కూడా వరుణ్ తేజ్ తో నటించేందుకు అల్లు బాబీ అడిగిన వెంటనే ఓకే చెప్పింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆమెను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

ఒక సూపర్ హిట్ ఒక ఫ్లాప్ లతో టాలీవుడ్ లో తన జర్నీ కొనసాగిస్తున్న కియారా అద్వానీ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమెను ఎంపిక చేసి ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుణ్ 10వ చిత్రం హీరోయిన్ విషయమై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer