ఆ బరస్ట్ వెనక అంతుందా?

0

అల్లు వారసుడు అల్లు అర్జున్ మెగా బ్రాండ్ ని సవ్యంగా ఉపయోగించుకుని పక్కా ప్రతిభతో ఎదిగిన హీరో. ఇంతింతై అన్న చందంగానే బన్నీ అగ్ర హీరోగా ఎదిగాడు. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నేడు టాలీవుడ్ అగ్ర హీరోలలోనే ఒకడిగా కొనసాగుతున్నాడు. జయాపజయాల్లోనూ అతడి ఇమేజ్ చెక్కు చెదరని స్థాయిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడు. తాజాగా మ్యూజిక్ కాన్సెర్ట్ ఈవెంట్ లో ఎన్నడు లేని విధంగా తండ్రిని ఉద్దేశించి బన్ని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇది యాథృచ్ఛికమా? లేక ఇంకేదైనా కథ ఉందా? అంటే తెలుగు మీడియాలో రకరకాలుగా చర్చ సాగుతోంది.

అల.. ఈవెంట్ కి ఒకరోజు ముందు `సరిలేరు నీకెవ్వరు` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మహేష్ తండ్రి గారు.. వెటరన్ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు అవార్డుల పరంగా దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదని…దాదాసాహెబ్ ఫాల్కే తో సత్కరించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహేష్ తండ్రి కృష్ణ అనేంతగా మహేష్ ఎదిగాడని ప్రశంసించారు. అయితే బన్నీ ఆ మరుసటి రోజు జరిగిన తన సినిమా ఈవెంట్ లో నాన్న గారు అరవింద్ ని పద్మశ్రీ తో సత్కరించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా తండ్రి తో తనకు ఉన్న అనుబంధాన్ని బన్ని ఈ వేదికపై గుర్తు చేసుకున్నాడు. తను పెళ్లి చేసుకున్నా తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని భార్య స్నేహకి కండీషన్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

నాన్నలో సగం ఎత్తుకు ఎదిగినా చాలని తన ఎత్తుని తగ్గించుకుని మాట్లాడాడు. తండ్రికి థాంక్స్ చెప్పడమే గాక.. ఇంత ఎమోషనల్ గా ఇన్నాళ్ల కెరీర్ లో ఏ వేదికపైనా బన్నీ ఇలా మాట్లాడలేదు. అదీ మెగా సూపర్ ఈవెంట్ తర్వాత బన్నీలోని ఎమోషన్ బయటపడింది. ప్రస్తుతం దీనిపై పరిశ్రమ సహా ప్రేక్షకుల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. బన్నీ అంతగా ఎమోషన్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? అంటూ సర్వత్రా చర్చాంశనీయమైంది. ఇక బన్నీ-అరవింద్ కి మధ్య చిన్న చిన్న విభేధాలు ఉన్నాయని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే ఇలా ఓపెనయ్యాడా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.

బన్నీ గీతా ఆర్స్ట్ ఆఫీస్ ని వదిలి..సొంతంగా తను ఓ ఆఫీస్ ను నిర్మించుకోవడం..తన సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలన్ని అక్కడ నుంచే కొనసాగించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే కథనాలు మరింతగా జోరందుకున్నాయి. మరి వాటిని చెరిపే ప్రయత్నంలో నిన్నటి రోజున ఈ వ్యాఖ్యలు చేసాడా? లేక మెగా వ్యాఖ్యలకు కౌంటర్ గానా? అన్న ముచ్చట ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మరి వీటన్నింటికి బన్నీ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer