వర్మ మర్డర్ పోస్టర్ పై అమృత రియాక్షన్ ఇదే..

0

సంచలన ఘటన జరిగినంతనే సినిమాను అనౌన్స్ చేసే అలవాటున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా మర్డర్ పేరుతో తన తాజా చిత్ర పోస్టర్ విడుదల చేయటం తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వర్మ మర్డర్ పేరుతో సినిమాను ప్లాన్ చేశారు. మిర్యాలగూడకు చెందిన అమృత.. ప్రణయ్ లు ప్రేమించుకోవటం.. వారిద్దరూ పెళ్లి చేసుకోవటం.. ఆపై ఆమె తండ్రి మారుతిరావు హత్య చేయించటం.. ఈ మధ్యనే అతను ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. పరువు హత్య నేపథ్యాన్ని తన తాజా చిత్ర ముడిసరుకుగా వర్మ తీసుకున్న వైనం మర్డర్ పోస్టర్ ను చూస్తే.. అర్థమవుతుంది.

ఈ పోస్టర్ పుణ్యమా అని.. అమృత.. మారుతిరావుల ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మ పోస్టర్ అమృత స్పందించారు. ఆవేదనతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పందరిని ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత పేర్కొన్నారు. ఇప్పటికే తన జీవితం తలకిందులైందని.. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ ను పోగొట్టుకున్నానని.. కన్నతండ్రికి కూడా దూరమయ్యానని పేర్కొన్నారు.

‘‘ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఇప్పటికే ఎన్నో ఛీత్కారాల్ని ఎదుర్కొన్నా. ఎవరికి వారు నా గురించి.. నా క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎవరికి తెలీదు. గర్వంతో పరువుపోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్ ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఇప్పుడు రాంగోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు’’ అని అన్నారు.

ఏడుద్దామన్నా కన్నీళ్లు రావటం లేదని.. హృదయం బండ బారిపోయిందన్నారు. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికి పోయానని చెప్పారు. తన కొడుకును చూసుకుంటూ.. ఉన్నంతలో ప్రశాంతంగా బతకటానికి ప్రయత్నిస్తున్నా.. ఇంతలో సమాజం కళ్లన్నీ మరోసారి తనపై పడేలా వర్మ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీలాంటి ఒక ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తుందన్న ఆమె.. నిన్ను చూస్తే జాలేస్తోందన్నారు. ‘‘ఈ నీచ.. నికృష్ట.. స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే.. ఎన్నో బాధల్ని అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్’’ అంటూ తన ప్రకటనను ముగించారు. తన ఆవేదనను అక్షర రూపంలో పేర్కొన్న అమృత స్పందన పై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో?




Please Read Disclaimer