దర్శకుడు చేయిపట్టుకోవడంపై రష్మి వివరణ

0సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ రోజుల్లో ఏ చిన్న విషయమైనా వివాదంగా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంటారు నెటిజన్లు. యూట్యూబ్ ఛానెళ్లలో హిట్స్ కోసం రకరకాల వ్యాఖ్యానాలతో వీడియోలు పెడుతుంటారు. ఇలాంటి వాటిని దృష్టిని ఉంచుకునే రష్మి గౌతమ్ జాగ్రత్త పడింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తన కొత్త సినిమా ‘అంతకుమించి’కు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రష్మి.. ఆ వేదికపై జరిగిన సంఘటన వివాదంగా మారకుండా చూసేందుకు ప్రయత్నించింది. రష్మి మాట్లాడేముందు ఒక సందర్భంలో ఈ చిత్ర దర్శకుడు జానీ ఆమె చేయి పట్టుకున్నాడు.

తాను ఇప్పుడు దీని గురించి ఏమీ మాట్లాడకుంటే రేప్పొద్దున్న యూట్యూబ్ ఛానెళ్లలో ఎలాంటి కామెంట్లు పడతాయో తనకు తెలుసని ఆమె అంది. స్టేజ్ పై హీరోయిన్ చేయి పట్టుకున్న దర్శకుడు.. అంటూ దీన్ని పెద్ద వివాదంగా మారుస్తారని ఆమె అంది. అందుకే అసలేం జరిగిందో చెబుతానంటూ వివరణ ఇచ్చింది. దర్శకుడి కంటే కూడా ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన మధుతో తనకు సాన్నిహిత్యం ఎక్కువని.. షూటింగ్ టైంలో జానీ సన్నివేశాలకు సంబంధించి ఏవో ఆలోచనల్లో ఉంటే.. మధు అన్నీ తానై చూసుకునేవాడని.. తనతో పాటు అందరికీ అన్నీ వివరించేవాడని ఆమె చెప్పింది. ఈ వేడుకకు మధు యాంకరింగ్ చేస్తాడని తనకు చెప్పే క్రమంలో జానీ తన చేయి పట్టుకున్నాడని.. అంతకుమించి ఏమీ లేదని.. దీన్ని దయచేసి ఎవరూ వివాదం చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇక సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన హాట్ సాంగ్ గురించి వివరిస్తూ అది కేక్ మీద ఆకర్షణ కోసం పూసే క్రీమ్ లాంటిదని.. నిజానికి సినిమాలో ఈ పాటను మించి బలమైన కంటెంట్ ఎంతో ఉందని ఆమె అంది.