లీక్డ్ ఫుటేజ్ తో చస్తున్నాం అంటూనే!

0

ప్రచారంలో ట్రెండ్ మారింది. ప్రతిదీ సోషల్ మీడియా.. యూట్యూబ్ వీడియోలతోనే జనాలకు కనెక్టివిటీ పెరిగిపోయింది. పత్రికల వరకూ వెళ్లి చదివే అలవాటు జనాల్లో చచ్చింది కాబట్టి అందుకు తగ్గట్టే దర్శకనిర్మాతలు డిజిటల్.. సోషల్ మీడియా ప్రచారానికే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ఈ కొత్తదారిలోనే వెళుతోంది. సరిలేరు నీకెవ్వరు టీమ్ చేస్తున్నది అదే.

తాజాగా అనీల్ రావిపూడి నుంచి అదిరిపోయే స్కిట్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సుబ్బరాజు- వెన్నెల కిషోర్ మీడియాకి సరిలేరు నీకెవ్వరు కథ స్క్రీన్ ప్లేని లీక్ చేసేస్తున్నారు. ఈలోగానే దర్శకుడు అనీల్ రావిపూడి ఆ ఇద్దరి మధ్యా ఎంటరయ్యారు. మన సినిమా రిలీజయ్యేది సంక్రాంతికి కదా.. ఇది దీపావళి. అప్పుడే కథంతా చెప్పేస్తే ఎలా? అంటూ మొట్టికాయలు వేశారు. ఇప్పటికే లీక్డ్ ఫోటోలు ఫుటేజ్ తో చస్తుంటే ఇలా లీకిస్తారేంటి? అంటూ ఆ ఇద్దరినీ చెడామడా కడిగేశాడు.

ఈ మొత్తం సీన్ ని ఓ కామిక్ వేలో తీర్చిదిద్దడం ఆసక్తికరం. అయితే సరిలేరు టీమ్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటో కానీ ఓ రకంగా కాంపిటీటర్ తో పోలిస్తే వెనకబడిందనే భావిస్తున్నారు. అల వైకుంఠపురములో నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. అవి రెండూ చార్ట్ బస్టర్స్ లో నిలిచి జనాల్లోకి దూసుకుపోయాయి. అందుకే ఇప్పుడిలా వీడియోని రిలీజ్ చేసి సంతృప్తి చెందారా? అంటూ పంచ్ లు పడుతున్నాయి. మహేష్ అభిమానుల కోసం అయినా ఈ దీపావళికి ఏదైనా స్పెషల్ గ్లింప్స్ వస్తుందనుకుంటే జస్ట్ పోస్టర్లతో సరిపెడతారా?
Please Read Disclaimer