మారుతి మీద భారీగా పంచ్ వేశావుగా అనిల్?

0

ఒకరిపై మరొకరు గౌరవ మర్యాదల్ని ప్రదర్శించుకోవటం.. నీ గురించి నేను వేలెత్తి చూపించను.. నా గురించి నువ్వు వేలెత్తి చూపించొద్దన్నట్లుగా ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆ మాటకు వస్తే.. ఒకే రంగానికి చెందినోళ్ల మధ్య బిజినెస్ పరంగా లెక్కలు తేడా వస్తే తప్పించి.. మిగిలిన సందర్భాల్లో ఎవరి గోల వారిదన్నట్లుగా ఉంటారు. ఏమైందో ఏమో కానీ.. ఈ రూల్ ను బ్రేక్ చేశాడు అనిల్ రావిపూడి. సరదాగా అటెంప్ట్ చేశాడో.. లేక ఇంకేమైనా విషయాలు ఉన్నాయో తెలీదు కానీ.. అవసరం లేకున్నా ఒక అంశాన్ని తన తాజా మూవీ సరిలేరు నీకెవ్వరులో కెలికిన తీరు విస్మయానికి గురి చేయక మానదు.

ఆ మధ్య ప్రేమకథాచిత్రమ్ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ టైటిల్ కార్డు వేసుకొని సినిమా పరిశ్రమలో చర్చకు తెర తీశారు దర్శకుడు మారుతి. ఆయనిచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ తాను వేసుకున్న దర్శకత్వ పర్యవేక్షణ గురించి ప్రశ్నను ఎదుర్కోవటం.. దానికి సమాధానం చెప్పటం చూస్తున్నదే.

ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై దర్శకుడు అనిల్ రావిపూడి తన తాజా చిత్రంలో ఎటకారం చేసిన వైనం చూసినప్పుడు.. భలే పంచ్ వేశాడుగా అనుకోకుండా ఉండలేం. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరో పాత్రధారి మహేశ్ ఒక డైలాగ్ లో.. దర్శకత్వ పర్యవేక్షణ పేరు వేసుకుంటే ఆ లాభమే వేరు.. బొమ్మ హిట్ అయితే పేరు మనదని చెప్పుకోవచ్చు.. ఫట్ అయితే.. పక్కనోడి మీద తోసేయొచ్చు అంటూ సటైర్ వేసిన తీరు కొత్త స్పర్థలకు తావిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారటం ఖాయం.

కావాలని కెలికాడో..కాస్తంత కామెడీ ఉంటుందోనని ట్రై చేశాడో కానీ అనిల్ రావిపూడి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఎవడి ఈగో వాడిది. సినిమాలో హీరోతో సటైర్ వేయించిన తర్వాత దాని మీద చర్చ జరగకుండా ఉంటుందా? దానికి తగ్గట్లు అంతో ఇంతో రచ్చ చోటు చేసుకోకుండా ఉంటుందా? అన్న భావన మనసుకు కలగకుండా మానదు. ఒకరిపైన వేలెత్తి చూపించే ధోరణి ముదిరితే.. అదో వార్ లా మారుతుందన్న విషయాన్ని అనిల్ రావిపూడి మర్చిపోతే.. మహేశ్ బాబు ఎందుకు గుర్తు చేయనట్లు? అయితే.. తన బావ హీరోగా నటించిన సినిమాకు మారుతి వేసుకున్న దర్శకత్వ పర్యవేక్షణ మీద ఇంతకాలానికి పంచ్ వేయటం ఏమిటి? ఏమైనా.. దీనిపైన మారుతి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Please Read Disclaimer