మరో నటవారసుడు హీరోగా ఫెయిల్!

0

బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో నటవారసుల(నెప్టోయిజం)పై ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి లెగసీని కాపాడలేక వారసులు చతికిలబడుతున్నారు. దశాబ్దాల పాటు అగ్ర హీరోలుగా వెలిగిన స్టార్ల పుత్ర రత్నాలు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. 90వ దశకంలో స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేసిన క్రేజీ హీరో అనీల్ కపూర్ వారసుడు హర్షవర్థన్ కపూర్ పరిస్థితి అదే. నటవారసుడిగా అతడు ‘మిర్జియా’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

అనురాగ్ కశ్యప్ రూపొందించిన ‘బాంబే వెల్వెట్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన హర్షవర్ధన్ కపూర్ తండ్రి బలవంతంతో నటుడిగా మారాడు. అయితే తన సోదరి సోనమ్ కపూర్ తరహాలో బాలీవుడ్ తెరపై సక్సెస్ కాలేకపోయాడు. దీంతో స్మాల్ బీ అభిషేక్ బచ్చన్ తరహాలోనే అతడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. అమితాబ్ వారసుడిగా బరిలో దిగిన అభిషేక్ ఆ లెగసీని కాపాడలేక పెద్ద ఫెయిల్యూర్ ని ఎదుర్కొన్నాడు. అభిషేక్ బచ్చన్ ఫెయిల్యూర్ బిగ్ బికి డైజెస్ట్ కాలేదు. అతడి తరువాత వారసులు సక్సెస్ సాధించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి ఎంటరైన ఆయుష్మాన్ ఖురానా.. రాజ్కుమార్ రావు.. కార్తిక్ ఆర్యన్ వంటి వాళ్లు వరుస విజయాలు సాధిస్తుంటే ఇప్పుడు అనీల్ కపూర్ వారసుడు మాత్రం వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ దారుణంగా విఫలమవుతున్నాడు.

నటవారసుడు హర్షవర్ధన్ కపూర్ ఇప్పటి వరకు రెండు చిత్రాల్లో నటించాడు. కానీ ఎలాంటి విజయాల్ని దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఒలింపిక్ గొల్డ్ మెడల్ విన్నింగ్ షూటర్ .. బిజినెస్ మేన్ అభినవ్ బింద్రా బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫలితంపైనే హర్షవర్థన్ కపూర్ కెరీర్ ఆధారపడి వుంది. ఇదైనా అతన్ని హీరోగా నిలబెడుతుందో లేక బ్యాక్ టు పెవిలియన్ అంటూ మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మళ్లిస్తుందో చూడాలి. ఓవైపు కొడుకును స్టార్ హీరోని చెయ్యాలన్న కోరిక నెరవేరక అనీల్ కపూర్ ఎంతో ఆత్రంగా వేచి చూస్తుండడంతో కపూర్ వారసుడిపై అభిమానుల్లో వేడెక్కించే చర్చ సాగుతోంది.