లైంగిక వేధింపుల కేసులో పోలీసుల విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు..!

0

తెలుగులో ‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ అగర్వాల్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం) – 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) – 341 మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు దర్శకుడికి సమన్లు జారీ చేశారు.

ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై అనురాగ్ కశ్యప్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. మరి ఈ విచారణలో ఎటువంటి నిజాలు బయటికి వస్తాయో చూడాలి. ఇదిలా ఉండగా తనకు న్యాయం చేయాలని.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించమని పాయల్ సోషల్ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఇదే క్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసి తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది.