స్ట్రీట్ డ్యాన్సర్ 3డి జింతాత జితాత

0

బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా పాపులారిటీ తెలిసిందే. ఆయన డ్యాన్స్ మూవ్స్ కి వీరాభిమానులున్నారు. సంజయ్ లీలా భన్సాలీ `బాజీరావ్ మస్తానీ` చిత్రంలోని `మస్తానీ.. మస్తానీ`… పాటకు జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు రెమో. ఇదే చిత్రంలో దీపికా పదుకునే- ప్రియాంకా చోప్రాలపై చిత్రీకరించిన `పింగా గపోరి` పాటకు రెమో డిసౌజా కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు ఉత్తరాదితో పాటు దక్షిణాది కూడా ఫిదా అయిపోయారు.

ప్రభుదేవా సమకాలికుడైన గ్రేట్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్న రెమో డిసౌజా డ్యాన్స్ నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు. ఏబీసీడీ- ఏబీసీడీ 2 చిత్రాలను రూపొందించి ప్రశంసలందుకున్న ఆయన తాజాగా`స్ట్రీట్ డ్యాన్సర్స్ 3డి` పేరుతో మరో డ్యాన్సింగ్ హంగామాకు తెరలేపారు. వరుణ్ ధావన్- శ్రద్ధాకపూర్- ప్రభుదేవా- `బాహుబలి` ఫేమ్ నోరా ఫతే- మురళీశర్మ- పునీత్ పాథక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 24న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోని చిత్ర బృందం న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రిలీజ్ చేసింది.

ఈ వీడియోలో గ్రేట్ ఇండియన్ డ్యాన్స్ మూవ్స్ ని చూపించడం ఆకట్టుకుంటోంది. దేసీ తుమ్కా.. నజర్ ఉతార్కె.. ఖలేజా కాట్కే.. గణపతి డ్యాన్స్… నాగిన్ డ్యాన్స్.. పతంగ్ డ్యాన్స్.. ఇలా అన్ని రకాల గ్రేట్ ఇండియన్ డ్యాన్స్ మూవ్స్ తో వరుణ్ ధావన్- శ్రద్ధాకపూర్- నోరా ఫతేహి- పునీత్ పాథక్ భళా అనిపించారు. గ్రేట్ ఇండియన్ మూవ్స్ తో కొత్తగా ప్లాన్ చేసిన ఈ ప్రోమో నెటిజనులను ఆకట్టుకుంటోంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer