రానా నటించిన ఆ పాన్ ఇండియా మూవీ ఊసే లేదుగా…?

0

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తా చాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో ‘భళ్లాలదేవుడు’గా నటించిన రానా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ క్రమంలో ‘అరణ్య’ అనే పాన్ ఇండియా మూవీలో నటించాడు రానా. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాలోమన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.ఇక ఈ చిత్రం తెలుగులో ‘అరణ్య’.. తమిళంలో ‘కాదన్’.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మానవులు – జంతువులను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే మావటి వాడిగా.. జంతు ప్రేమికుడు ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాలో రానా మేనరిజం.. ఆయన హావభావాలు నడక చాలా కొత్తగా అనిపించడంతో పాటు కచ్చితంగా ఈ పాత్ర రానా కెరీర్ లో గుర్తిండిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో కరోనా వచ్చి రానా మీద దెబ్బేసింది. అప్పుడెప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా కాస్తా కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా పడింది.కాగా ‘అరణ్య’ టీజర్ రిలీజ్ చేసి హడావుడి చేసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత ఈ పాన్ ఇండియా సినిమా ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అన్ని సినిమాలు రిలీజెస్ లేకపోయినా ఏదొక విధంగా ప్రేక్షకుల్లో ఉండాలని అప్డేట్ ఇస్తూ వస్తున్న తరుణంలో ‘అరణ్య’ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే పాన్ ఇండియా రిలీజ్ అవ్వడం కష్టమే అని అర్థం అవుతోంది. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేద్దాం అనుకున్నా ఎంతో ఖర్చు పెట్టి తీసిన ‘అరణ్య’ సినిమాకి ఇప్పుడప్పుడే సోలో రిలీజ్ డేట్ దొరికే ఛాన్స్ కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల అందరూ ఓటీటీల వైపు చూస్తున్న తరుణంలో ‘అరణ్య’ టీమ్ కూడా ఆ వైపుగా అడుగులు వేస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ‘లైఫ్ ఆఫ్ పై’ ‘థోర్’ ‘బై మోక్ష్ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్ అందించిన ప్రాణ స్టూడియో వి.ఎఫ్.ఎక్స్ అందించింది. ‘త్రీ ఇడియట్స్’ ‘పీకే’ ‘పింక్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఆస్కార్ అవార్డ్ విజేత రసూల్ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ చేసారు. ఇక ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రభు సాల్మోన్ శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Please Read Disclaimer