‘సర్కారు వారి పాట’ విలన్ జాబితాలో మరో హీరో

0

మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా దర్శకుడు పరశురామ్ అండ్ టీం చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని మొదటి నుండి అంటున్నారు. బిలియనీర్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త పాత్ర ఈ సినిమాలో విలన్ గా చూపించబోతున్నారనేది టాక్.

ఆ పాత్ర కోసం ప్రముఖ స్టార్స్ ను సంప్రదిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొదట ఆ పాత్రకు గాను కన్నడ స్టార్ హీరో సుదీప్ ను సంప్రదించారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత కన్నడ మరో స్టార్ హీరో ఉపేంద్ర తో కూడా చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. వారిద్దరు నో అన్నారో లేదంటే అసలు చర్చలు జరిగాయో లేదో కాని ఇప్పుడు తమిళ స్టార్ అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రను చేయబోతున్నట్లుగా కొత్త టాక్ మొదలైంది.

తెలుగులో అరవింద్ స్వామికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ ధృవ చిత్రంలో అరవింద్ స్వామి నటించి మెప్పించాడు. అందుకే ఈ సినిమాలో కూడా ఆయన్ను విలన్ పాత్రకు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట. మహేష్ బాబు కూడా అరవింద్ స్వామి విలన్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నాడట. అందుకే సర్కారు వారి పాట లో అరవింద్ స్వామి నటించడం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer