ఓటీటీలు ప్లాప్ సినిమాలకు అడ్డాగా మారుతున్నాయా…?

0

కొన్ని సినిమాలు స్టోరీ డిస్కషన్స్ సమయంలోనే సక్సెస్ అవుతాయా లేదా అనేది తెలిసిపోతుంది.. ఇంకొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని ఒక ఐడియాకి వచ్చేయొచ్చు. కొన్ని సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత ఫలితాన్ని అంచనా వేయొచ్చు. అయితే సినిమా అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం మరియు వాటిపై కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటారు. అందుకోసం సినిమా ఎలా ఉన్నా దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అలాంటి సినిమాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయట. వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతపడి ఉన్నాయి. సిచ్యుయేషన్ చూస్తుంటే మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓపెన్ చేసినా ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చిన మొత్తానికి వడ్డీలు కట్టుకోలేక ఓటీటీ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నారు.

అంతేకాకుండా ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ఇస్తున్నప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయడం ఎందుకులే అనుకున్న నిర్మాతలు.. ఒకవేళ థియేటర్లు తెరచినా రిలీజ్ కి థియేటర్స్ దొరకని పరిస్థితి వస్తుందని భావించిన వాళ్లూ ఓటీటీలకు ఓటు వేస్తున్నారు. అయితే వీటితో పాటు కొత్తగా తమ సినిమాలు నిరాశపరిచే ఫలితాన్ని ఇస్తాయని భావిస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారట. సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్న తర్వాత అవి ఎలాగైనా ప్లాప్ అవుతాయని భావించి ఓటీటీలు ఇచ్చే ప్రైజ్ కి సినిమాలు అమ్మేస్తున్నారట. గత కొన్ని రోజులుగా ఓటీటీలలో రిలీజైన సినిమాలు పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఈ మధ్య ఓటీటీలో వరుసగా ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అన్ని సినిమాలు నెగిటివ్ రివ్యూస్ తో థియేటర్ లో విడుదల చేయాల్సిన సినిమాలే కాదని తీర్పు చెప్పేసాయి.

ఇప్పటికే అన్ని భాషల్లో దాదాపు పది సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్క సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. అయితే మరో రెండు మూడు ప్లాప్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయితే ఓటీటీ అంటే ఫ్లాప్ సినిమాల ఫ్లాట్ ఫార్మ్ అనే ముద్ర పడిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడంటే ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇలానే వరుసగా అన్ని ప్లాప్ సినిమాలే వస్తే రాబోయే రోజుల్లో ఓటీటీలు కూడా చెప్పిన రేటుకి సినిమాలు కొనడానికి ముందుకురాకపోవచ్చు. ఇక ఓటీటీలలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అన్నప్పటి నుండి ఒక్కటైనా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కలిగిస్తుందేమో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ తేదీలను ప్రకటించాయి. మరి వాటిలో ఒక్కటైనా సూపర్ హిట్ సినిమా అనే టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
Please Read Disclaimer