ఆ సినిమా అవుట్ పుట్ పై నిర్మాతలకు అసంతృప్తి?

0

తీసిన ప్రతి సినిమా బాగుంటుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే మహా భ్రమ మరొకటి ఉండదు. నిజానికి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు సినిమా ఎలా ఉందనేది తీర్పునిస్తారు. చాలామంది ఫిలింమేకర్లకు అప్పటి వరకూ తత్వం బోధపడదు. అప్పటివరకూ తమ సినిమా ‘వేరే లెవెల్’ అనే నమ్మకంతోనే ఉంటారు. అయితే కొందరికి మాత్రం తమ సినిమా భవిష్యత్తు షూటింగ్ సమయంలోనే అర్థమైపోతుంది. అయితే బిర్యాని సగం వండేసిన తర్వాత పడేయలేం కదా.. ఎవరో బకరాలను వెతుక్కుని వారికి పెట్టాలి. ఖర్మ కాలితే మనం కూడా తినాలి. సరిగ్గా అలానే బాగాలేని సినిమాలను కూడా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈమధ్య ఒక యువహీరో సినిమా పరిస్థితి అలానే ఉందట.

ఆ హీరోకు వరస ఫ్లాపులు తగలడంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టి వరసగా షూటింగులలో పాల్గొంటున్నాడు. మనం చెప్పుకుంటున్న సినిమా సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజ్ కానుంది. అయితే ఈ బ్యానర్ వారు నిర్మించిన మరో భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. దీంతో తమ దృష్టి అంతా ఆ సినిమాపైనే పెట్టారు. ఈ యువ హీరో సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్ ఉంది. అప్డేట్స్ గురించి అడిగితే ముందు సంక్రాంతి సినిమా హడావుడి కానివ్వండి.. తర్వాత చూద్దాం అని మాట దాటేస్తున్నారట. అంతేకానీ పొరపాటున కూడా సదరు యువహీరో సినిమా గురించి చెప్పడం లేదట.

దీంతో యువహీరో సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదని.. అందుకే ఆ సినిమా గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో రిలీజ్ చేశాం అంటే చేశామన్నట్టుగా వదిలించుకుందామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కొందరు యువ హీరోల సినిమాలను ఇలానే రిలీజ్ చేసి పబ్లిసిటీ ఖర్చులు.. రిలీజ్ అయిన తర్వాత ట్రోలింగ్ ను తగ్గించుకున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer