హ్యాట్రిక్‌ కొట్టిన `అర్జున్‌ రెడ్డి`.. అక్కడ కూడా రచ్చ రచ్చే..!

0

విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా అర్జున్‌ రెడ్డి. ఈ సినిమాతో హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే విజయ్‌ స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నాడనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.

టాలీవుడ్‌లో సెన్సేషన్‌

తెలుగులో రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది అర్జున్‌ రెడ్డి సినిమా. ముఖ్యంగా ఈ సినిమా తొలి పోస్టర్‌గా హీరో హీరోయిన్‌ల లిప్ లాక్‌ స్టిల్‌ను రిలీజ్ చేయటం వివాదానికి కారణమైంది. ఈ పోస్టర్‌పై పలు రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయటంతో సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది.

వివాదం – వసూళ్లు

సినిమా రిలీజ్‌ తరువాత కూడా వివాదాలు కొనసాగాయి. అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయటంతో సినిమా రిలీజ్‌ తరువాత కూడా అర్జున్‌ రెడ్డి వార్తల్లో నిలిచాడు. అయితే అనూహ్యంగా సినీ ప్రముఖులు అర్జున్‌ రెడ్డికి మద్ధతుగా నిలిచారు. మహేష్ బాబు, రామ్‌ చరణ్ లాంటి టాప్‌ స్టార్లు కూడా అర్జున్‌ రెడ్డి అద్భుతం అంటూ పొగడటంతో సినీ అభిమానులు అర్జున్‌ రెడ్డిని చూసేందుకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది.

బాలీవుడ్‌లోనూ వదలని వివాదాలు

తెలుగులో సంచలనం సృష్టించటంతో ఈ ప్రకంపనలు బాలీవుడ్ దాకా చేరాయి. దీంతో అర్జున్‌ రెడ్డి బాలీవుడ్‌ రీమేక్‌పై ఆసక్తినెలకొంది. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలోనే బాలీవుడ్‌ రీమేక్‌ కబీర్‌ సింగ్‌ను తెరకెక్కించారు. షాహిద్ కపూర్‌, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటించారు. అర్జున్‌ రెడ్డి వివాదాలు బాలీవుడ్‌లోనూ కొనసాగాయి. సినిమా రిలీజ్‌ తరువాత బాలీవుడ్‌ క్రిటిక్స్‌ కబీర్‌ సింగ్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే క్రిటిక్స్‌ ఏమన్నా ప్రేక్షకులు మాత్రం బాలీవుడ్‌లోనూ అర్జున్‌ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా అక్కడ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది బాలీవుడ్‌ హైయ్యస్ట్‌ గ్రాసర్స్‌ లిస్ట్‌లో చేరింది.

కోలీవుడ్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌

టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఘన విజయం సాదించటంతో కోలీవుడ్ అర్జున్‌ రెడ్డి మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌, ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటం అర్జున్‌ రెడ్డి రీమేక్‌ మీద అంచనాలు పెంచేసింది. ఆదిత్య వర్మ పేరుతో కోలీవుడ్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎన్నో వివాదాలు, వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిత్య వర్మ, అర్జున్‌ రెడ్డి మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేశాడు.
Please Read Disclaimer