చిరంజీవికి ఏం తెలుసు అంటున్న సీనియర్ ప్రొడ్యూసర్!

0

కొన్ని అంశాలపై స్పందించడం సెలబ్రిటీలకు కత్తిమీద సాము లాంటిది. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించడం అలాంటిదే. మూడు రాజధానులు.. వికేంద్రీకరణ మంచిది అంటే ‘అమరావతి .. ఒకే రాజధాని ఉండాలి’ అని నమ్మేవారి నుంచి విమర్శలు తప్పవు. అలా అని మూడు రాజధానులు వద్దు అంటే ఉత్తరాంధ్ర.. సీమ ప్రజలు కస్సుమంటారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంపై తమ స్పందన తెలపకుండా ఊరుకున్నారు. అయితే మూడు రాజధానుల ప్రతి పాదనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీనియర్ నిర్మాత చిరంజీవి అత్యంత సన్నిహితులలో ఒకరైన అశ్వినిదత్ వాదన భిన్నంగా ఉంది.

అశ్వినిదత్ జగన్ గవర్నమెంట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అమరావతినే ఆంధ్ర రాజధానిగా కొనసాగించాలని తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ చిరంజీవిని కూడా తీవ్రంగా విమర్శించారు. అసలు చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులపై మాట్లాడారని.. ఆ ప్రతిపాదనకు మద్దతిచ్చారన్నారు. మరొవైపు అమరావతి రైతులకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ను అశ్వినిదత్ ప్రశంసించారు. పవన్ ఒక పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారని అన్నారు. పవన్ అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తున్నారని.. అమరావతి నుంచి రాజధాని తరలిపోకూడదని పవన్ పోరాడుతుంటే చిరంజీవి మూడు రాజధానుల ప్రపోజల్ కు మద్దతివ్వడం సరికాదని అన్నారు.

ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ లో కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మెగాస్టార్ పై అశ్విని దత్ చేసిన విమర్శలను మెగా ఫ్యాన్స్ స్వీకరిస్తారా లేదా అశ్విని దత్ పై తిరిగి విమర్శలు చేస్తారా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer