ఆ ట్రోల్స్ బాగా హెల్ప్ అయ్యాయట!

0

తెలుగు ప్రేక్షకులను చిన్నతనంలోనే ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో మెప్పించిన అవికా గౌర్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండు మూడు సినిమాలతో మెప్పించిన అవికా గౌర్ ఆ తర్వాత సక్సెస్ లు అందుకోలేక పోయింది. దానికి తోడు బాగా లావు అవ్వడంతో విమర్శలు ఎదుర్కొంది. లావు తగ్గేందుకు కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల ‘రాజు గారి గది 3’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపై ఎలాంటి పాత్రల్లో అయినా.. ఎలా అయినా నటించేందుకు సిద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా రాజు గారి గది 3 చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అవికా గౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఒక సినిమా వేడుకలో స్కర్ట్ వేసుకుని డాన్స్ వేశాను. ఆ సమయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు. నన్ను మొదటిసారి అలా చూడటంతో చాలా మంది వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో నేను బాగా లావుగా ఉన్నానంటూ తీవ్రంగా ట్రోల్స్ చేశారు. నాపై వచ్చిన ట్రోల్స్ ను నేను పాజిటివ్ గా తీసుకున్నాను.

లావు అవ్వడం అనేది నా అనారోగ్య సమస్య కాదు. ఎక్కువ తినడం మరియు బద్దకం కారణంగా వ్యాయామం చేయక పోవడం. నాపై వచ్చిన ట్రోల్స్ తో నేను బద్దకం వదిలేశాను. నేను రాజు గారి గది 3 చిత్రంలో 12 కేజీల బరువు తగ్గి నటించాను. ఈ సినిమాతో మంచి స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాపై వచ్చిన ట్రోల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ట్రోల్స్ రాకుంటే నేను బరువు తగ్గాలని అనుకునేదాన్ని కాదు.. దాని వల్ల నా అవకాశాలు తగ్గేవి. ట్రోల్స్ ను సవాల్ గా తీసుకుని నేను సన్నబడ్డానంటూ అవికా చెప్పుకొచ్చింది.

సన్నబడ్డ అవికా గ్లామర్ పాత్రలు చేసేందుకు సై అంటోంది. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు ఇచ్చినా చేసేందుకు సిద్దం అంటూ ఈ అమ్మడు ప్రకటించింది. సన్నబడటంతో నాపై నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నేను ఎలాంటి డ్రస్ లను అయినా వేసుకోవచ్చు అంటూ ఎక్స్ పోజింగ్ చేస్తానంటూ హింట్ ఇచ్చింది. మరి ఈమెకు తెలుగులో మళ్లీ బిజీ అయ్యేంతగా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.