భాఘి 3: ట్రైలర్

0

నన్ను ఎదిరించే మొనగాడు టైగర్ మాత్రమే! అంటూ హృతిక్ ఇచ్చిన కాంప్లిమెంట్ ని అంత తేలిగ్గా మర్చిపోలేం. వార్ సినిమాలో గురు శిష్యులుగా నటించినప్పుడు చాలా దగ్గరగా టైగర్ ష్రాఫ్ బాడీ లాంగ్వేజ్ ని గమనించి ఈ కితాబిచ్చాడు హృతిక్. ఇక ఆ సినిమాలో గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాల్లో హృతిక్ తో ధీటుగా తలపడి శహభాష్ అనిపించాడు. ఇక బాలీవుడ్ లో హృతిక్ తర్వాత మళ్లీ అంతటి మొనగాడు టైగర్ మాత్రమే అన్నంతగా ఎదిగేసిన తీరు అసమానం. ఇక టైగర్ ష్రాఫ్ లో సిల్వస్టర్ స్టాలోన్ ర్యాంబో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తున్న బ్లాక్ బస్టర్ సిరీస్ భాఘి కి యాక్షన్ ఆయువు పట్టు. రొటీన్ కథలే అయినా తొలి రెండు భాగాలు ఘనవిజయం సాధించడంలో భారీ యాక్షన్.. టైగర్ గగుర్పొడిచే విన్యాసాలే కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడో సినిమా భాఘి 3 థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలతో హాలీవుడ్ ట్రైలర్ చూస్తున్నామా? అన్నంతగా ఆశ్చర్యపరిచింది. టైగర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే ఇందులో భారీ సాహసాల్ని.. యాక్షన్ ని తీర్చిదిద్దిన తీరు హైలైట్.

తొలి రెండు భాగాల్ని తెలుగు సినిమాల ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం కొత్తదనం నిండిన కథతో తెరకెక్కించారని అర్థమవుతోంది. ముఖ్యంగా రితేష్ దేశ్ ముఖ్ ఇందులో టైగర్ సోదరుడిగా కనిపిస్తున్నాడు. అమాయకుడైన పోలీస్ అధికారిగా ఉగ్రవాద దేశం సిరియాలో అడుగు పెట్టిన రితేష్ ప్రమాదకర ఐసిస్ తీవ్రవాదులకు చిక్కుతాడు. అటుపై సోదరుడిని రక్షించుకునేవాడిగా టైగర్ కింకర్తవ్యం ఏమిటి? అన్నదే సినిమా కథాంశం. అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్దాకపూర్ కథానాయికగా నటించింది. మార్చి 6 న సినిమా రిలీజవుతోంది. అంతా బాగానే ఉంది కానీ.. రెగ్యులర్ గా బాలీవుడ్ లో భారీ యాక్షన్ సినిమాలొస్తున్నాయి. వాటికంటే కథ-కథనం పరంగా కొత్తగా ఏం ట్రై చేశారు? అన్నదే సినిమా జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. ఆ విషయంలో టైగర్ అండ్ టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెరపైనే చూడాల్సి ఉంటుంది.
Please Read Disclaimer