మాస్కులు ధరించి ఫైట్ చేసుకున్న ‘బాహుబలి – భల్లాలదేవుడు’…!

0

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు కరోనా తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. లాక్ డౌన్ షరతులు సడలించిన తర్వాత కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో భయంతో ప్రజలు వణికి పోతున్నారు. ఈ క్రమంలో అందరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యమయింది. ఈ నేపథ్యంలో మాస్కులు – గ్లౌజులు – శానిటైజర్స్ జీవితంలో ఒక భాగం అయ్యాయి. ముఖ్యంగా మాస్కులు మనకు రక్షణ కవచంలా మహమ్మారి సోకకుండా కాపాడుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ వినియోగంపై పలు సూచనలు చేశాయి. వీటిని పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారికి ఫైన్ కూడా వేస్తున్నారు. ఇప్పటికే ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ఇళ్లలోనే సేఫ్ గా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తుండగా.. దర్శకధీరుడు రాజమౌళి స్టే హోమ్ బీ సేఫ్ అంటూ మరోసారి మాస్క్ వినియోగం గురించి తెలియజేస్తూ ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు.

రాజమౌళి షేర్ చేసిన వీడియోలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సీన్ వస్తుంది. ఈ సీన్ లో మహేంద్ర బాహుబలి – భల్లాలదేవుడు వీరోచితంగా పోట్లాడుకుంటారు. అయితే ఈ ఫైట్ లో రానా – ప్రభాస్ ఇద్దరూ మాస్కులు ధరించి ఉన్నారు. సినిమాలో వారి ముఖానికి మాస్కులు ఏమీ ఉండవు కదా ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారా.. ఇదంతా జక్కన్న స్టైల్ లో గ్రాఫిక్స్ మాయాజాలంతో జరిగిందిలేండి. ఈ వీడియోతో ”మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి చేయబడింది.. మీరు కూడా వాడటం మర్చిపోకండి” అని సలహా ఇచ్చారు.

దీనిని షేర్ చేసిన జక్కన్న ”గుడ్ జాబ్.. ఈ సమయాల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటారని మరియు జాగ్రత్తగా ఉండాలని నేను ఆశిస్తున్నాను” అని ఆ వీడియో క్రియేట్ చేసిన అవిటూన్ ఇండియా మరియు కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్స్ మంచి ప్రయత్నం చేశాయని ప్రశంసించారు. ‘బాహుబలి’ మాస్కుల వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.. సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Please Read Disclaimer