ఉరిశిక్ష కంటే ఘోరమైన శిక్ష వేసిన కేసీఆర్

0

మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ మరోమారు గులాబీదళపతి కేసీఆర్ పై మండిపడ్డారు. సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బాబుమోహన్ కన్నీటి పర్యంతం అవుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కేసీఆరే… నడిరోడ్డుపైన వదిలేశారని బాధపడుతూ చెప్పారు. ఉరిశిక్ష కంటే ఘోరమైన శిక్షను కేసీఆర్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.“కేసీఆర్ ను గాడ్ ఫాదర్ గా భావిస్తాను.. కానీ ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు. స్థానికుడనే పేరుతో మరో వ్యక్తికి టికెట్ కేటాయించారు. 25 సంవత్సరాలుగా ఆందోల్ నుంచే పోటీ చేసిన నేను.. ఎలా స్థానికుడిని కాకుండా పోయాను. సముద్రంలో ఉన్న నన్ను ఒక్క సారిగా నడిరోడ్డుపై పడేశారు” అంటూ కన్నీళ్ల పెట్టుకున్నారు.టీఆర్ ఎస్ తాజాగా బరిలోకి దించిన క్రాంతి కిరణ్ ఏనాడు టీఆర్ ఎస్ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు.

ఈ సందర్బఃగా తనకు టికెట్ కేటాయించకపోవడంపై బాబుమోహన్ మండిపడ్డారు. “ఉరిశిక్ష వేసే ఖైదీలకు ఆఖరి కోరిక అడుగుతారు. కానీ 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికాను. ఎమ్మెల్యేగా ఉన్న నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి – మంత్రి కేటీఆర్ స్పందించలేదు. ఈరోజు వరకు నాకు టీఆర్ ఎస్ నాయకులు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. నా సేవలను జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుర్తించింది. అందుకే ఆ పార్టీలో చేరాను” అని బాబూ మోహన్ అన్నారు. బీసీ దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని… దళితున్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.