సూపర్ స్టార్ కే ఇంత దారుణ స్థితి?

0

బడా హీరో సినిమా వస్తోందంటే అభిమానుల్లోనే కాదు.. మార్కెట్ వర్గాల్లోనూ సందడి ఉంటుంది. ముఖ్యంగా బయ్యర్లు.. పంపిణీదారుల్లో ఏదో తెలీని ఆనందం కనిపిస్తుంది. పైగా సంక్రాంతి రేసులో పెద్ద హీరో దిగుతున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాని కొనేందుకు పోటీపడుతుంటారు. ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి ఏరియా వైజ్ హక్కుల్ని సొంతం చేసుకుంటుంటారు. కానీ ఈ సంక్రాంతి రేసులో వస్తున్న సూపర్ స్టార్ రజనీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నది ట్రేడ్ మాట. సాక్షాత్తూ రజనీ సినిమా ఇది.. మురుగదాస్ దర్శకుడు.. అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నా పంపిణీదారులు.. బయ్యర్లు ఆ వైపు కూడా చూడటం లేదట. ఏరియా వైజ్ సేల్ కి గేట్లు ఎత్తేసినా.. దర్బార్ కి కనీస రేటు కూడా పలకడం లేదని టాక్ వినిపిస్తోంది. అది అంత పెద్ద స్టార్ కి అవమానమేనన్న గుసగుసలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.

రజనీ-నయన్ నాయకానాయికలుగా ఏఆర్. మురుగదాస్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఎంతో కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తూ రూపొందిస్తున్న దర్బార్ సంక్రాంతి బరిలో తెలుగు- తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అయినా ఎందుకనో బజ్ లేదన్న మాట వినిపిస్తోంది. తెలుగు రైట్స్ కొనేందుకు ఎవరూ సాహసించడం లేదట. అయితే గత నాలుగైదేళ్లుగా రజనీ సినిమాలు ఆశించిన విజయాలు దక్కించుకోకపోవడం పంపిణీదారులకు తీవ్ర నష్టాల్ని మిగల్చడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. రజనీ నటించిన కబాలి- కాలా-పేట చిత్రాలు తెలుగులో డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఆ ప్రభావం `దర్బార్` చిత్రంపైనా పడిందట. ఈ చిత్రాన్ని కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ఆసక్తిని చూపించడం లేదట. గడిచిన ఇన్నేళ్ల లో రజనీ సినిమాకి అంతో ఇంతో మార్కెట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదన్న మాట అభిమనులకు ఆవేదన కలిగిస్తోంది.

అయితే దర్బార్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడానికి కారణాల్ని విశ్లేషిస్తే..ఈసారి సంక్రాంతికి మునుపటితో పోలిస్తే పోటీ ఠఫ్ గా ఉంది. మహేష్ `సరిలేరు నీకెవ్వరు`.. అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో భారీ అంచనాల నడుమ భారీ క్రేజుతో రిలీజ్ అవుతున్నాయి. వాటిని పక్కన పెట్టి తెలుగు ప్రేక్షకుడు రజనీ సినిమాకు వస్తాడా? అంటూ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే రజనీ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదన్న వాదనా వినిపిస్తోంది. సూపర్ స్టార్ అంతటివాడికే ఈ అవమానం తప్పడం లేదన్న చర్చ సాగుతోంది. హిట్టును మాత్రమే నమ్మే మార్కెట్ కి సూపర్ స్టార్ అయినా.. సడెన్ స్టార్ అయినా.. ఒకటేననేందుకు ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు.




Please Read Disclaimer