#NBK105: బాలయ్య ఫస్ట్ లుక్.. మహా స్టైల్!

0

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు #NBK105 గా పిలుచుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. ‘రూలర్’.. ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని గతంలో గుసగుసలు వినిపించాయి కానీ అధికారికంగా ఇంకా ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలయ్య తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. కొత్త తరహా గడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న బాలయ్య లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇదే గెటప్ తో #NBK105 టీమ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ అఫీషియల్ లుక్ ను విడుదల చేస్తూ #NBK105 లో బాలయ్య వ్యాన్ డైక్ బియర్డ్ స్టైల్ లో కనిపిస్తారని వెల్లడించారు. 17 వ శతాబ్దానికి చెందిన ఫేమస్ పెయింటర్ వ్యాన్ డైక్ పేరిట ఈ గడ్డం పాపులర్ అయింది. అయితే ఈ గెటప్ చూస్తే ఎక్కువ మందికి గుర్తొచ్చేది మాత్రం ‘ఐరన్ మ్యాన్’ లో టోనీ స్టార్క్ పాత్ర పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్. ఈ గెటప్ బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. గుబురుగా కాకుండా సన్నగా చేసిన మీసం.. బుగ్గల దగ్గర షేవింగ్ చేసి లంగరు షేప్ లో ఉంచిన గడ్డంలో బాలయ్య యమా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ కళ్ళజోడు.. సూటు బూటులో అసలు సిసలైన నందమూరి స్టార్ అనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారట.




Please Read Disclaimer