బాలు జ్ఞాపకాలు: మోహన్ బాబు వందకు వడ్డీ.. చిరుకు చివాట్లు!

0

దక్షిణాది సినీ సంగీతానికి వన్నె తెచ్చిన గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. వేలాది పాటల్ని తనదైన శైలిలో ఆలపించి కోట్లాదిగా అభిమానుల్ని దక్కించుకున్నారు. గాన గంధర్వుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న బాలు అకాలమరణం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలని తీవ్ర మనో వేదనకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా బాలుతో వున్న తమ అనుబంధాన్ని సినీ ప్రముఖులు నెమరు వేసుకుంటున్నారు. తను కష్టాల్లో వున్న సమయంలో బాలు వద్ద వంద రూపాయలు అప్పు తీసుకున్న విషయాన్ని మోహన్ బాబు బయటపెట్టారు.

తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆర్థికంగా మోహన్ బాబు కష్టాల్లో వున్నారట. అప్పుడు బాలు దగ్గరికి వెళ్లి వంద అప్పు చేశారట. మేం కలుసుకున్నప్పుడల్లా ఆ వంద రూపాయల విషయం గుర్తు చేస్తూ వడ్డీతో కలిపి ఇప్పడది ఎంతవుతుందో తెలుసా?.. వడ్డీతో కలిపి నా డబ్బులు నాకిచ్చేయ్ ` అని బాలు సరదాగా ఆటపట్టించేవాడని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. బాలుని ప్రేమగా పిలుచుకుంటే ఆయన మాత్రం తనని భక్తా.. వత్సా.. శిశుపాలా అని పిలిచేవారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ పరంగా తన సక్సెస్ కు బాలునే కారణమన్నారు చిరంజీవి. తనకి ఇంత ప్రజాదరణ పెరగడానికి ప్రధానంగా బాలు పాడిన పాటలే కీలక పాత్ర పోషించాయన్నారు. మొదట్లో ఆయన గొప్పదనం తెలియక నువ్వు అని సంబోధించేవాడిని. ఆయన గొప్పదనం తెలిసాక మీరు అనడం మొదలుపెట్టాను. అదేంటయ్యా మీరు అంటూ దూరం పెంచడం.. నన్ను నువ్వు అనే సంబోధించు అనేవారు. ఒక దశలో తనని హెచ్చరించారని కూడా చిరు చెప్పుకొచ్చారు. ఏమయ్యా నువ్వు కమర్షియల్ చట్రంలో పడి నీలో వున్న నటుడిని దూరం చేసుకుంటున్నావ్. నువ్వు మంచి నటుడివి. నటనకు ప్రాధాన్యం వున్న పాత్రల్లో నటించాలి` అని ఓ శ్రేయోభిలాషిగా హెచ్చరించి చీవాట్లు పెట్టారని మెగాస్టార్ గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.