వెంకీ ట్రైన్ ఎపిసోడ్ ను మించిపోతుందా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అటు మహేష్.. ఇటు అనిల్ ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉండడం అందుకు ఒక కారణం అయితే విజయశాంతి రీ-ఎంట్రీ ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత కమెడియన్ పాత్ర పోషిస్తూ ఉండడం కూడా సినిమాపై బజ్ ను మరింతగా పెరిగేలా చేసింది.

మహేష్ బాబు తన సినిమాలకు ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరుంది కానీ.. పూరి జగన్నాధ్ లాంటి స్పీడ్ డైరెక్టర్స్ తో చేసే సమయంలో మాత్రం షెడ్యూల్స్ చకచకా పూర్తవుతుంటాయి.. అతి తక్కువ సమయంలో సినిమాను కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు అనిల్ రావిపూడితో షూటింగ్ అలాంటి స్పీడ్ తోనే సాగుతోంది. ఇప్పటికే కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను పూర్తి చేశారంటేనే మనం అనిల్ స్పీడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ లో ట్రైన్ ఎపిసోడ్ కు సంబంధించిన పలు సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. ఈ షూట్ లో బండ్ల గణేష్ కూడా పాల్గొన్నాడు. ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని టాక్ వినిపిస్తోంది. బండ్ల గణేష్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు రీసెంట్ గా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు అనిల్.. హీరోయిన్ రష్మిక..హరితేజ తదితరులు ఉన్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ లో ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి ఇతర టీమ్ మెంబర్స్ అంటున్నారు. ట్రైన్ ఎపిసోడ్స్ లో ఫన్ అద్బుతంగా వర్క్ అవుట్ అయిన చిత్రం రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వెంకీ’. ఇప్పటికీ కామెడీ విషయంలో ఆ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ను మరో చిత్రం మరిపించలేకపోయింది. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ కావడంతో ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ‘వెంకీ’ ట్రైన్ ఎపిసోడ్ ను సరిలేరు మించిపోతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer