ఆర్జీవీ డీ కంపెనీ ఆఫీస్.. జరంత భద్రం!

0

హైదరాబాద్ టు ముంబై .. ముంబై టు హైదరాబాద్ ఆర్జీవీ జర్నీ గురించి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ పేరుతో అతడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వర్మ మార్క్ భావజాలం ఉన్న టెక్నీషియన్స్.. సహాయ దర్శకులు.. రచయితలు ఆయనతో పాటే ట్రావెల్ చేసేందుకు ఈ ఫ్యాక్టరీలో చేరేవారు. అయితే ఆర్జీవీ హైదరాబాద్ నుంచి సడెన్ గా ముంబైకి షిఫ్ట్ అయ్యి హిందీ పరిశ్రమలో సినిమాలు చేయడంతో ఇక్కడ ఫ్యాక్టరీ చాలా కాలం క్రితమే మూత పడింది. నాగార్జున నటించిన ‘గోవిందా గోవిందా’ రిలీజ్ సమయంలో వివాదం వల్లనే అతడు అలిగి ముంబై వెళ్లాడని ప్రచారమైంది. ఆ క్రమంలోనే ముంబైలో ఢీ కంపెనీ తరహాలో కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేశాడు. హిందీ పరిశ్రమలో దశాబ్ధం పైగానే వర్మ బ్రాండ్ పాపులరైంది. అక్కడ సాంకేతిక నిపుణులు ట్యాలెంటుకు అవకాశం దక్కింది.

పాతికేళ్ల పాటు ముంబైలోనే ఉన్న ఆర్జీవీ అక్కడ వరుస డిజాస్టర్లు ఎదురవ్వడంతో కంపెనీని మూసేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు. ఆ క్రమంలోనే ఇక్కడ నాగార్జున మేనల్లుడు సుమంత్ను వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో సినిమాలు తీస్తూనే.. హైదరాబాద్ కేంద్రంగా ఓ ఆఫీస్ ని తెరిచాడు. ఇక్కడ రక్త చరిత్ర లాంటి వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించి తనదైన మార్క్ ప్రచారంతో లైమ్ లైట్ లో కొనసాగాడు. అయితే కాలక్రమంలో ఐస్ క్రీమ్.. జీఎస్టీ అంటూ అతడు చేసిన ప్రయోగాలన్నీ తీవ్ర విమర్శల పాలు కావడంతో ఎంతో నిరాశకు గురయ్యాడు. ఇటీవల లక్ష్మీ స్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ లైఫ్ ని లక్ష్మీ పార్వతి కోణంలో చూపించి తీవ్ర దుమారం రేపాడు. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై సినిమా తీస్తున్నాడు.

అయితే ఈ జర్నీలో ఇటీవల హైదరాబాద్ లో తనకంటూ ప్రత్యేకించి ఓ కార్యాలయం ఏదీ లేదు. తాజాగా సొంత ఆఫీస్ అంటూ అతడు ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ కొత్త ఆఫీస్ పేరు ‘కంపెనీ’. ఆ ఫోటోలో ఆఫీస్ ఎంతో క్రియేటివ్ గా కనిపిస్తోంది. సైకిల్ చైన్.. తుపాకి కనిపిస్తుండడంతో ఆఫీస్ వర్మ మార్క్ లో ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. కొత్త హైదరాబాద్ ఆఫీస్ ఫోటోలో క్రియేటివిటీ బాగానే ఉంది కానీ.. సినిమాల్లోనూ అంతే క్రియేటివ్ గా ఆయన ఏం చేయబోతున్నారు అన్నదే చూడాలి. ఆర్జీవీ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడం లేదని ఇటీవల విమర్శలున్నాయి. ఇకనైనా ఆయన మైండ్ సెట్ మారి పెద్ద స్పాన్ తో మంచి కథలతో సినిమాలు తీస్తారేమో చూడాలి. వివాదాలతో ప్రచారం అవసరం లేకుండానే కంటెంట్ తో ఏం మ్యాజిక్ చేస్తారు? అన్నది చూడాలి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వివాదాలు మోసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఆఫీస్ కం ‘కంపెనీ’ .. జరంత భద్రం!! అంటూ హెచ్చరిస్తున్నారు అభిమానులు..!!
Please Read Disclaimer