ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్…!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రభాస్ ‘విక్రమాదిత్య’ – హీరోయిన్ పూజా హెగ్డే ‘ప్రేరణ’ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ వదిలారు. ఓ అరచేతిలో చూపిస్తూ అందులో నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలుని చూపించారు. ఆ రైలులో సలీం – అనార్కలి.. రోమియో – జూలియట్.. దేవదాస్ – పార్వతి వంటి కొంతమంది ప్రఖ్యాత ప్రేమికులను చూపిస్తూ రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ ని పట్టుకోవడం చూపించారు. అప్పుడే ట్రైన్ డోర్ లో నుంచి వింటేజ్ ప్రేమికులు ప్రభాస్ – పూజాహెగ్డే బయటకు వేలాడుతున్నట్లు చూపించారు. దీనికి చివరలో మ్యూజిక్ బిట్ జత చేశారు. మోషన్ పోస్టర్ అని చెప్పినా టీజర్ అనుకునే విధంగా చూపించారు. ఈ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘రాధే శ్యామ్’ తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – సచిన్ ఖేడ్కర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.