ఆరోగ్యం గురించి బిగ్ బి షాకింగ్ కామెంట్స్

0

రోగాన్ని దాచొద్దంటారు వైద్యులు. కానీ.. సెలబ్రిటీలు.. ప్రముఖులు తమకున్న రోగాల గురించి పెదవి విప్పటానికి అస్సలు ఇష్టపడరు. చివరి వరకూ వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని రహస్యంగా దాచేస్తుంటారు. అందుకు భిన్నంగా తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి సంచలన నిజాల్ని వెల్లడించి షాకిచ్చారు బిగ్ బి అమితాబ్.
తన కాలేయం 75 శాతం పూర్తిగా దెబ్బ తిందన్న చేదు నిజాన్ని చెప్పేశారు. తానిప్పుడు కేవలం 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నట్లు చెప్పారు. తన లివర్ లో 75 శాతం పూర్తిగా ఇన్ఫెక్ట్ అయ్యిందని చెప్పారు. గతంలో తనకు క్షయ.. హైపటైటిస్ బి లాంటి వ్యాధులతో కూడా పోరాడిన వైనాన్ని రివీల్ చేశారు.

తనకు క్షయ ఉందన్న విషయాన్ని ఎనిమిదేళ్లు ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పారు. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవటం వల్లే తనకు సదరు వ్యాధి ఉందన్న విషయం తెలీలేదన్నారు. ఆరోగ్య పరీక్షల్ని నిర్ణీత కాలంలో చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తాజాగా జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బిగ్ బీ ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే సమస్యలు గుర్తించే వీలు కలుగుతుందని.. పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. బిగ్ బి ఆరోగ్యం గురించిన చేదు నిజాన్ని జీర్ణించుకోవటం ఆయన అభిమానులకు కాస్తంత కష్టమైన విషయమేనని చెప్పక తప్పదు.
Please Read Disclaimer