ఫైనల్లీ.. నా కల నిజం కాబోతోంది : ప్రభాస్

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ఈ క్రమంలో లేటెస్టుగా మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడని ప్రకటించారు. ‘లెజెండ్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం. అమితాబ్ బచ్చన్ ఇందులో భాగం అయ్యారు. భారత్ లో ఉన్న సూపర్ స్టార్స్ ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’ అని పేర్కొంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ఓ వీడియో రిలీజ్ చేసింది.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించాలని ప్రతి ఒక్క యాక్టర్ కోరుకుంటారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ”ఫైనల్లీ.. నా కల నిజం కాబోతోంది. లెజండరీ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను” అని పేర్కొన్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ‘బచ్చన్ సర్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మూవీలో బిగ్ బీ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన స్థాయికి తగ్గ పాత్రను సృష్టించామని చెప్పగలను. ఆయనతో పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పాడు.

నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. ”అమితాబ్ బచ్చన్ మా సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అమితాబ్ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. నేను ఎన్టీఆర్ కలిసి ‘షోలే’ చిత్రాన్ని చాలా సార్లు చూసాం. మా వైజయంతీ మూవీస్ లో రూపొందిస్తున్న సినిమాలో నటించడానికి అమితాబ్ అంగీకరించినందుకు.. ఆయనతో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించారు. అమితాబ్ ఇంతకముందు ‘మనం’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు సినిమాలలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందనుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరించనున్నాడు. స్వప్నదత్ – ప్రియాంకా దత్ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.