బిగ్ బాస్ బంఫర్ ఆఫర్: వాళ్లిద్దరూ పెళ్లాడితే రూ.2కోట్ల గిఫ్ట్

0

వివిధ దేశాల్లో పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్ బాస్. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. హిందీ.. తమిళం.. తెలుగు.. ఇలా పలు భాషల్లో ఇప్పటిక ఈ రియాల్టీ షోను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 3 ముగియటం.. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా అవతరించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 13 నడుస్తోంది. తాజా సీజన్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న రష్మీ దేశాయ్.. ఆమెతో పాటే ఉన్న అర్హన్ ఖాన్ మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ అందరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాల్టీ షో చివరకు వచ్చేసింది. ఈ సీజన్ విజేతగా నిలిచే వారి పేర్లలో తొలుత సిద్దార్థ్ శుక్లా పేరు వినిపిస్తుంటే.. ఇంకొకరు ఎవరో కాదు రష్మీ దేశాయే. నిజానికి తాజా సీజన్ ను జనాలు చూసేందుకు ప్రధాన కారణం ఆమేనన్న మాట కూడా వినిపిస్తోంది.

రష్మీ.. అర్హన్ ఖాన్ ల మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ చూసినప్పుడు బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహుల్.. పునర్నవి ఎపిసోడ్ అదాటున గుర్తుకు రావటం తెలిసిందే. అందరూ అనుకున్నట్లుగా తమ మధ్య ప్రేమా.. దోమా లాంటివేమీ లేవని స్పష్టం చేయటం చూస్తున్నదే. ఇదిలా ఉంటే.. హిందీలో నడుస్తున్న సీజన్ 13లో మాత్రం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ దోబూచులాడుతూనే ఉంది.

ఎలిమినేట్ అయి.. తిరిగి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అర్హన్ ఖాన్.. ఈసారి గోల్డ్ రింగుతో ఇంట్లోకి ప్రవేశించాడు. బంగారు ఉంగరాన్ని తీసుకొచ్చి.. ప్రపోజ్ చేయాలనుకుంటున్న అర్హన్ ఖాన్ ను రష్మీ పిచ్చ లైట్ తీసుకోవటం అందరిలో ఆసక్తి మరింత పెంచేస్తోంది. ఇలా ఇరువురి మధ్య దోబుచులాడుతున్న ప్రేమ లెక్క తేల్చటానికి బిగ్ బాస్ అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు.

గతంలో ఎప్పుడూ లేని వేళ.. ఈ జంట కానీ పెళ్లి చేసుకుంటే తాను రూ.2 కోట్ల మొత్తాన్ని బహుమానంగా ఇస్తానని చెప్పి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. మరి.. బిగ్ బాస్ మాటతో ఈ జంట ఎలా రియాక్ట్ కానుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ షోలో పాల్గొన్న జంట మాదిరే రష్మీ దేశాయ్.. అర్హన్ ఇద్దరూ పెళ్లాడతారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారి ఉత్కంఠను రేకెత్తిస్తోంది.