ఒక ఎపిసోడ్ లో 3 గొడవలతో దద్దరిల్లిన బిగ్ బాస్ హౌస్!

0

మిగిలిన రెండు సీజన్ల మాదిరి కాకుండా మనం హుందాగా వ్యవహరిద్దాం.. అంటూ మొదటిరెండు ఎపిసోడ్లలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య జరిగిన మాటలకు పూర్తి భిన్నంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 3. తొలివారంలోనే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కు నామినేట్ కావటంతో బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్ గా మారింది. మనసు కోతి లాంటిది.. ఎప్పుడెలా వ్యవహరిస్తుందో తెలీదన్న దానికి తగ్గట్లే.. హౌస్ లోని హౌస్ మేట్స్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. తొలి రెండు రోజుల్లో ప్రదర్శించిన మర్యాదల్ని తొక్క తీసినంత సింఫుల్ గా తీసిపారేయటం కనిపించింది. ఎవరికి వారు విశ్వరూపం చూపిస్తున్నారు.

ఒక ఎపిసోడ్ లో మూడు గొడవలు చోటు చేసుకోవటం గడిచిన రెండు సీజన్లలో చూడనిది. గురువారం ఎపిసోడ్ మొత్తం గొడవలతో హౌస్ రచ్చ రచ్చగా మారటమే కాదు.. ఈ గొడవలేందిరా బాబు? అన్న భావన కలిగేలా చేస్తున్నారు హౌస్ మేట్స్. బిగ్ బాస్ ఉద్దేశమే గొడవలు. అప్పుడే హౌస్ మేట్స్ లోని అసలైన క్యారెక్టర్లు బయటకు వస్తాయి. తాజా సీజన్ లో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా బిగ్ బాస్ హౌస్ నిలవటమే కాదు.. ఒకరితో గొడవ ఎలా పెట్టుకోవాలన్నది ఈ షోను చూస్తే చాలా ఇట్టే తెలిసిపోతుందన్న పరిస్థితి.

గురువారం ఎపిసోడ్ లో మొత్తం మూడు గొడవలు.. ఆరు అరుపులు అన్నట్లు సాగింది. బుధవారం ఎపిసోడ్ లో మొదలైన రాహుల్ – హేమ గొడవ గురువారం కొనసాగి.. క్లోజ్ అయ్యింది. ఇక.. గురువారం ఎపిసోడ్ లో మూడు గొడవలు చోటు చేసుకున్నాయి. అందులో యమా సిల్లీ గొడవగా అర ముక్క చపాతీ కోసం పునర్నవి భూపాలం చేసిందైతే.. సీరియస్ గొడవగా మహేశ్ విట్టా.. వరుణ్ సందేశ్ ల మధ్య ఉదంతాన్ని చెప్పాలి. ఒక దశలో ఇద్దరూ కొట్టుకునే వరకూ వెళ్లింది. తన భార్య పట్ల మర్యాదగా వ్యవహరించంటూ వరుణ్ సీరియస్ కావటం.. మహేశ్ సైతం తగ్గకపోవటం ఇష్యూ యమా సీరియస్ గా మారింది.

ఇక హౌస్ లో పటాస్ ఫైర్ బ్రాండ్లుగా చెలరేగిపోతున్న హేమ-శ్రీముఖిల మధ్యే గొడవైంది. అప్పటివరకూ అక్కా.. అక్కా అని శ్రీముఖి.. చెల్లి అంటూ హేమ పండించిన భావోద్వేగం మొత్తం బందర్ కు వెళ్లిపోగా.. ఈ ఇరువురు అక్కా.. తొక్కా అన్న రీతిలో మాటా మాటా అనుకొని హౌస్ లో వేడి పుట్టించారు. గురువారం నాటి ఎపిసోడ్ లో చోటు చేసుకున్న మూడు గొడవల్లో మహేశ్ వర్సెస్ వరుణ్ సందేశ్ ల మధ్య సాగుతున్న వార్.. ఈ రోజు (శుక్రవారం) ఎపిసోడ్ లో మరింత ముదిరిపోయేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వంట గది నా సామ్రాజ్యం.. నేనిక్కడ రాణిని.. నేను పెట్టింది తినాలన్నట్లుగా హేమ బిల్డప్ ఇవ్వటం.. దీనికి రాహుల్ అభ్యంతరం చెబుతూ.. మీ ఇష్టం అంటారేంటి? హౌస్ లో 15 మందిమి ఉన్నాం.. మీ ఇష్టమే అంటే కుదరదంటూ గట్టిగా వాదించటంతో ఇష్యూ మరింత ముదిరింది. వీరి మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించగా.. ఇరువురు ఒక పట్టాన తగ్గలేదు.

అంతలో హేమ కల్పించుకొని.. రేపు నాగార్జున వస్తారుగా అప్పుడే తేల్చుకుందామని అనటంతో.. పక్కనే ఉన్న మహేశ్ విట్టా కల్పించుకొని ఆయన లెవల్ ఏంటి? మన ఈ పత్తి యాపారం ఏంటి? అంటూ అదిరిపోయే టైమింగ్ తో ఇచ్చిన పంచ్ మాటతో హేమ నోరెళ్లబెట్టేలా చేశాడు. మొత్తానికి రాహుల్- హేమ మధ్య లొల్లి ఒక కొలిక్కి వచ్చేసిందనుకునే లోపు పునర్నవి తన చపాతీని సగం తినేశారంటూ సిల్లీ రచ్చను షురూ చేసి.. హౌస్ ని ఆగమాగం చేసేశారు.

తన చపాతీని అలీ రజా సగం తినేశారని.. ఇంత సిల్లీగా ఉంటారంటూ హౌస్ మేట్స్ దగ్గర హడావుడి చేయటంతో.. ఎపిసోడ్ ను టీవీలో చూస్తున్న వారికి.. సగం చపాతీ కోసం ఇంత రచ్చా? అంటూ నోరెళ్లబెట్టేలా చేయటమే కాదు.. గొడవకు పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు.. సగం చపాతీ ముక్కతోనూ సాధ్యమనేటట్లు చేసింది పునర్నవి భూపాలం.

ఈ గొడవపై సోషల్ మీడియాలోనూ చపాతీ ముక్క మీద భారీగా మీమ్స్ మొదలయ్యాయి. హౌస్ మేట్స్ దగ్గర తన సగం చపాతీ ముక్కను అలీ రాజా తినేశాడన్న మాటను చెప్పటం.. ఇదే విషయాన్ని హేమ వచ్చి అలీ రాజా చెవిలో అలా అనుకుంటున్నారంటూ ఊదేయటంతో అతగాడు రియాక్ట్ అయి.. సగం చపాతీని తిన్నది తాను కాదని బాబా భాస్కర్ అంటూ అసలు నిజాన్ని చెప్పేశాడు.

బాబా భాస్కర్ వచ్చి.. కర్రీ బాగుందని తాను రెండు చపాతీలు తిన్నానంటూ తనదైన శైలిలో కామెడీ చేయటంతో.. గొడవకు కారణమైన చపాతి సుందరి పునర్నవి నాలుక్కర్చుకొని.. అయ్యో మీరు తిన్నారా? అనవసరంగా అలీని అనేశానే అంటూ మిగిలిన చపాతి ముక్కను తినేసింది. పునర్నవి చేసి చపాతి రచ్చను అలీ లైట్ తీసుకోవటంతో ఈ ఇష్యూ మరింత సాగకుండా బ్రేక్ పడింది.

ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా హేమ.. జాఫర్ లను టాస్క్ కోసం ఎంపిక చేసుకున్నారు హౌస్ మేట్స్. వారిద్దరు గేమ్ ను సక్సెస్ చేయటంతో ఒక్కో సభ్యుడికి 200పాయింట్ల చొప్పున మొత్తం 3వేల పాయింట్లు వచ్చాయి. అయితే.. ఆ పాయింట్లకు తగ్గట్లు వస్తువుల్ని ఎంపిక చేసుకోవటం ఫెయిల్ అయ్యారు హౌస్ మేట్స్. సరిపడా వస్తువుల్ని ఎంపిక చేసుకోవటంలో శ్రీముఖి టైంకి లేకపోవటమే అని హేమ అనటంతో ఫైర్ బ్రాండ్ చెలరేగిపోయింది.

అప్పటివరకూ అక్కా.. అక్కా అంటూ చెట్టాపట్టాలేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో తిరిగిన శ్రీముఖి.. హేమ మీద ఒక రేంజ్లో చెలరేగిపోయారు. ఈ గొడవలో హేమ కూడా తగ్గలేదు. వస్తువుల్ని ఎంపిక చేసుకునే టైంలో ప్లేట్ లో అన్నం పెట్టుకోవటం వల్లే ఆలస్యమైందని.. లేకుంటే మరిన్ని వస్తువులు తీసుకునే వాళ్లమని హేమ చెప్పగా.. తాను అన్నం పెట్టుకున్నా.. టైంకే వచ్చానని.. టీవీ ఆన్ చేసే విషయంలో మహేశ్ ఫెయిల్ అయి తనను అంటారెందుకంటూ ఘాటుగా బదులిచ్చింది.

ఈ సందర్భంగా అలిగిన శ్రీముఖి స్మోకింగ్ జోన్ లోకి వెళ్లి కూర్చుంది. హౌస్ మేట్స్ అందరూ వెళ్లి ఆమెను బుజ్జగించి.. అన్నం తినమన్నారు. దాంతో మొత్తబడి రెండు నిమిషాల్లో వస్తానని చెప్పింది శ్రీముఖి. హేమ సైతం శ్రీముఖి వద్దకు వెళ్లి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖి ఘాటుగా బదులిచ్చింది. వీరిద్దరి మధ్య గొడవ సందర్భంలో శ్రీముఖి తొక్కలో అంటూ హేమపై ఫైర్ అయ్యింది. ఇలా వీరి మధ్య గొడవ ఒక కొలిక్కి రానప్పటికీ.. ఊహించని రీతిలో మరో గొడవ షురూ అయ్యింది. అప్పటివరకూ జరిగిన రచ్చల్ని తలదన్నే గొడవ మొదలైంది. ఇది మహేశ్ విట్టా- వరుణ్ సందేశ్ మధ్య చోటు చేసుకుంది. తనను మహేశ్ లోపలికి పో అన్నాడంటూ వితిక షెరు పెద్దగా అరవటంతో ఇష్యూ సీరియస్ గా మారింది. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ విశ్వరూపం చూపించాడు.

ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా? సిగ్గులేనోడా? అంటూ మహేశ్ ను కొట్టేందుకు మీదికి వెళుతుండగా.. మహేశ్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే.. వరుణ్ మీది మీదికి రావటంతో మహేశ్ ధీటుగా స్పందించే ప్రయత్నం చేశాడు. ఇరువురి మధ్య మాటలు అంతకంతకూ పెరుగుతూ.. రారా అంటే రారా అన్నట్లుగా మాటలు రువ్వుకున్నారు. నా భార్యకు రెస్పెక్ట్ ఇవ్వు అంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు. వితిక సైతం మహేశ్ మీద గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం కంటిన్యూ అవుతుండగా.. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. చూస్తుంటే.. శుక్రవారం ఎపిసోడ్ మరింత రచ్చ జరిగేలా ఉందన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ చూసినప్పుడు ఈ గొడవలేంటి? ఆ మాటలు అనుకోవటాలేంటి? అన్న క్వశ్చన్లు మనసులోకి రావటం ఖాయం.
Please Read Disclaimer