కౌశల్ బాబూ.. ఏమిటా ఆవేశం?

0

బిగ్ బాస్ రెండో సీజన్‌తో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తి కౌశల్ మండా. అప్పటికే సీరియళ్లు సినిమాలు టీవీ షోలు.. ఇలా ఎన్నో చేసినా రాని పాపులారిటీ ఈ షోతో అతడికి వచ్చింది. ఐతే అతణ్ని అభిమానించే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. వ్యతిరేకించే వాళ్లు అంతకుమించే ఉన్నారు. అందుకు అతను చేసే అతి ఒక కారణం. బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు.. బయట కూడా కౌశల్ ఏం చేసినా ఓవర్ ద టాప్ అన్నట్లే ఉంటుంది. లాక్ డౌన్ టైంలో ఒక అరటిపండ్ల బండి ముందు కారు ఆపి వెయ్యి రూపాయలకు పండ్లు కొంటూ అతను ఇచ్చిన బిల్డప్ ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా తన వంతుగా ఏదో చేద్దామని చూసిన కౌశల్.. నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటున్నాడు.

బాయ్‌కాట్ చైనా ఉద్యమంలో భాగంగా తాను ఇకపై చైనా ఉత్పత్తులు ఏవీ వాడనని అన్నాడు కౌశల్. ఈ విషయాన్ని చెబుతూ.. తన దగ్గరున్న ఒప్పో ఫోన్‌ను చూపించి దాన్ని నేలకేసి పగుల గొట్టాడు. తర్వాత ముక్కలైన ఫోన్ ను తీసి చెత్త బుట్ట లో వేశాడు. ఇది బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా ఓ టాస్కులో గెలిచిన ఫోన్ అని అతను వెల్లడించాడు. కౌశల్ ఫోన్ పగల గొట్టి తీసి చెత్త బుట్టలే వేస్తుండగా.. ఏంటిలా చేశావంటూ కౌశల్ కూతురో కొడుకో అంటున్నట్లు వాయిస్ వినిపించింది. ఐతే చైనా ఉత్పత్తులు వాడకూడదనుకుంటే.. ఇకపై ఆ విషయంలో నియంత్రణ పాటించవచ్చు.

కానీ ఆల్రెడీ తన దగ్గరున్న ఫోన్‌ను పగల గొట్టడమేంటో అర్థం కావడం లేదు జనాలకు. దీనికి సంబంధించి డబ్బులు ఆల్రెడీ చైనా వాడి చేతికి వెళ్లి ఉంటాయి. మనం వాడే అనేక వస్తువులతో పాటు జబ్బు పడితే వేసుకునే మందుల ముడిసరుకు కూడా చైనా నుంచే వస్తుందని నిపుణులంటున్నారు. చైనా ఉత్పత్తుల వాడకం తగ్గించడం మంచిదే కానీ.. కౌశల్ అంత ఆవేశం అయితే అవసరం లేదు. ఇంతకీ అతను చైనా ఉత్పత్తుల వాడకాన్ని ఆపడంలో ఎంత సిన్సియర్‌గా ఉంటాడో చూడాలి.
Please Read Disclaimer