BB3: మెగాస్టార్ లో ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా రాహుల్.. రన్నర్ గా శ్రీముఖి నిలిచింది. సీజన్ 2 విన్నర్ కు ట్రోఫీ ఇచ్చేందుకు వెంకటేష్ రాగా ఈసారి విన్నర్ కు ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ స్టేజ్ పైకి వచ్చారు. చాలా రోజులుగా చిరంజీవి బిగ్ బాస్ స్టేజ్ పైకి రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సైరా చిత్రం ప్రమోషన్స్ సమయంలోనే చిరంజీవి బిగ్ బాస్ షో లో సందడి చేస్తారని అన్నారు. కాని అప్పుడు వీలు పడలేదు. ఫైనల్ ఎపిసోడ్ కు నాగార్జున పిలుపు మేరకు చిరంజీవి వచ్చారట.

ఫైనల్ ఎపిసోడ్ చివరి అర్థగంట చిరంజీవి ప్రజెన్స్ తో హైలైట్ అయ్యింది. ఏదో వచ్చి అలా విన్నర్ ను అనౌన్స్ చేసి ట్రోఫీ ఇచ్చి వెళ్లాం అన్నట్లుగా కాకుండా చిరంజీవి గారు చాలా సరదాగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను నాగార్జున పరిచయం చేశారు. ఆ సమయంలో ఇందులో చాలా మంది నాకు తెలుసు అంటూ ఒకొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ వారి గురించిన విషయాలు మాట్లాడటంతో కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మొదటగా పునర్నవి పేరు చెప్పగానే నాగార్జున అయ్యో ఆమెను పునర్నవి గారు అంటూ పిలవాలని అనగానే చిరంజీవి అయ్యో నాకు తెలియదమ్మా సారీ పునర్నవి గారు అంటూ సరదాగా ఆటపట్టించారు. వరుణ్ మరియు వితికలపై ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత హేమతో మాట్లాడుతూ ఆమెను ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక శివ జ్యోతితో బిత్తిరి సత్తిగా మాట్లాడి మొత్తం షోలో ఉన్న వారినే కాకుండా టీవీల ముందు కూర్చున్న వారిని కూడా ఆశ్చర్యపర్చి ఆనందింపజేశారు.

అలీ గురించి మాట్లాడుతూ నిన్ను చూస్తే అసూయ వేస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. జాఫర్ ను చూడగానే భయపడ్డట్లుగా కామెడీ చేసి బాబోయ్ ఈయనతో జాగ్రత్త అన్నట్లుగా వ్యాఖ్యలు చేసి నవ్వు తెప్పించారు. ఇక బాబా భాస్కర్ ను బాగా నటించావు అంటూ కామెంట్ చేసి తన సెన్సాఫ్ హ్యూమర్ మరియు కామెడీ టైమింగ్ ను చిరంజీవి ప్రదర్శించారు. రోహిణి ఐలవ్ యు అనగానే మెలికలు తిరిగి పోయి ఈ మాట విని చాలా కాలం అయ్యింది అంటూ సిగ్గుపడి పోయారు. చివరగా తమన్నా సింహాద్రీతో మాట్లాడుతూ ఆమెను అభినందించారు. నువ్వు గ్రేట్ పర్సన్ అంటూ ప్రశంసించారు. ఆ తర్వాత రాహుల్ మరియు శ్రీముఖిలతో కూడా చిరంజీవి మాట్లాడిన మాటలు చాలా గొప్పగా అనిపించాయి.

రాహుల్ ను విజేతగా ప్రకటించిన తర్వాత శ్రీముఖి కాస్త డల్ అయితే ఆమెను చిల్ చేసేందుకు ఆమెపై పంచ్ వేశారు. రాహుల్ 50 లక్షలు తీసుకు వెళ్తున్నారు. కాని నువ్వు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నావు అంటూ ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. ఆమెను మీద చేయి వేసుకోమని మరీ సెల్ఫీ తీశారు. ఆ సమయంలో సురేఖ గారు ఇంట్లో అంటూ నాగార్జున ఏదో అనగానే సురేఖ వచ్చిందా అంటూ చిరు సరదాగా భయపడ్డట్లుగా నటించి అందరిని నవ్వించారు.

మొత్తానికి చిరు నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో సరదాగా ఉన్న తీరు చూసి చిరులో ఇంకా ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా అనుకుంటున్నారు. మెగాస్టార్ రాకతో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు క్రేజ్ రెట్టింపు అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు
Please Read Disclaimer