Templates by BIGtheme NET
Home >> Cinema News >> Kalyan Ram: కళ్యాణ్ రామ్ నిజాయితీకి దక్కిన గౌరవం ఇది.. ఇకనైనా నిర్మాతలూ బుద్ధి తెచ్చుకోండి

Kalyan Ram: కళ్యాణ్ రామ్ నిజాయితీకి దక్కిన గౌరవం ఇది.. ఇకనైనా నిర్మాతలూ బుద్ధి తెచ్చుకోండి


Kalyan Ram: ఇక సినీ పరిశ్రమ బతికి బట్ట కట్టడం కష్టమే అన్నారు, ఓటీటీల మీదా, ప్రభుత్వాల మీద పడి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇన్నాళ్లు ఏడ్చారు, అలాగే మరెన్నో విషయాల పై ఎన్నెన్నో విమర్శలు చేశారు. అంతిమంగా థియేటర్స్ కి ఇక జనాలు రారు అని నిట్టూర్చారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో జరుగుతోంది ఇదే. ఇలాంటి సమయంలోనే కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అంటూ వచ్చాడు. జనం థియేటర్స్ కి పరుగులు తీశారు. కలెక్షన్స్ వర్షం కురిపించారు. కారణం ఏమిటి ? ఒక్కటే.. అదే కథ. కథ పై కళ్యాణ్ రామ్ కి ఉన్న ప్రేమే ఈ విజయానికి ప్రధాన కారణం అయ్యింది. ఇది చూసి అయినా మన దర్శక నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవాలి.

మేం వందల కోట్లు ఖర్చు పెట్టి గొప్ప సినిమా తీసామని గొప్పలు చెప్పుకునే ముందు.. తమ కథలో కొత్త పాయింట్ ఏముంది ? అని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. స్టార్ల పై పెట్టే శ్రద్ధలో పదో వంతు కథ పై పెడితే.. ప్రేక్షకులు థియేటర్ కొచ్చే సినిమాలను చూస్తారు. ఎవరి అంచవాలకూ అందనంత పెద్ద విజయం సాధించింది బాహుబలి. ఆ సినిమా పేరు చెప్పుకుని ప్రతి స్టార్ హీరో సినిమా మార్కెట్ ను విపరీతంగా పెంచేశారు. ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి రాబట్టుకోవచ్చన్న పిచ్చి నమ్మకంతో హీరోల కోసం మంచినీళ్ల ప్రాయం గా డబ్బులను గుమ్మరిస్తున్నారు. చివరకు మా బడ్జెట్ పెరిగింది కాబట్టి, టిక్కెట్ రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుకుని, ప్రజలను దోచుకుంటామంటే జనాలు అమాయకులు కాదు.

తమను దోచుకునే దోపిడీ ప్లాన్ పై ప్రజలు ఆలస్యంగానైనా తిరగబడతారు. రూ.150 టికెట్ ను రూ.500 లకు అమ్ముతుంటే ఎందుకు అంత పెట్టి సినిమా చూడాలి ?, చివరకు టికెట్ రేట్లకు భయపడి జనం థియేటర్స్ కి రాకపోతే.. నేరం ఓటీటీలదే అంటూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ పూర్తిగా మునిగిపోకుండా కాపాడింది ఓటీటీ బిజినెస్. అన్నం పెడుతున్న చేతులనే నరుక్కునేలా ఏవేవో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్న నిర్మాతల బృందాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. చెరువు మీద అలిగితే చేటు ఎవరికి ?, తమ కడుపే కంపు కొడుతోంది. ఇప్పుడు ఓటీటీ ల పై నిర్మాతలు ఆంక్షలు కూడా వారికే చేటు చేసేలా ఉన్నాయి.

సరే.. నిర్మాతలు చెబుతున్న ప్రకారం వందల కోట్లు పెట్టి గ్రాండ్ గా సినిమాను తీస్తామంటున్నారు. కానీ, ఆ సినిమాలో గ్రాండ్ నెస్ మాత్రం కనిపించదు. అసలు నిర్మాతలు చెప్పే బడ్జెట్ లో మూడొంతులు స్టార్ హీరోలూ, దర్శకుల రెమ్యూనరేషన్ లకే పోయాక, ఇక మిగిలిన దాంతో తీసే సినిమాలో గ్రాండ్ నెస్ ఏముంటుంది ?, అలాంటి సినిమా కోసం ఎందుకు వందలు వందలు ఖర్చు పెట్టి టికెట్ కొనాలి ?, పైగా తమ సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ డబ్బా కొట్టుకుంటారు. కరెక్ట్ గా లెక్కలు చూస్తే.. బాహుబలి తర్వాత పుష్ప, ఆర్ఆర్ఆర్, సాహో తప్ప వేరే ఏ తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో కనీస స్థాయిలో కూడా వసూళ్లు సాధించలేదు. మరింకా ఈ పానిండియా జాడ్యం ఎందుకు ?, ఇది చెప్పుకుని లోకల్ లో కూడా భారీ సినిమా అంటూ సామాన్య ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేయడం ఎందుకు ?,

ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ను ఖచ్చితంగా అభినందించాలి. తనకున్న బడ్జెట్ పరిమితులను దృష్టి లో పెట్టుకుని.. లో బడ్జెట్ లో కూడా నాణ్యమైన సినిమా తీశాడు. పైగా తమ సినిమా అంత గొప్ప సినిమా ఏం కాదు. గ్రాఫిక్స్ వంటివి కూడా పానిండియా రేంజ్ లో ఉండవు అంటూ నిజాయితీగా నిజాలు చెప్పాడు. అందుకే, ప్రేక్షకులు కూడా కళ్యాణ్ రామ్ సినిమాని తెలుగు సినిమాలానే చూశారు. అనవసరపు అంచనాలు లేకుండా.. సాధారణ ప్రేక్షకులు లాగే థియేటర్స్ కి వెళ్లారు. ఫలితంగా బింబిసార గొప్ప విజయం సాధించింది. ఖచ్చితంగా చెప్పొచ్చు, నిజాయితీకి దక్కిన గౌరవం ఇది. అన్నిటికీ మించి ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా పెద్ద సినిమాల కంటే బింబిసార సినిమా సాధించిన ఘనత ఇది. ఈ ఘనతలు ప్రతి నిర్మాత సాధించొచ్చు, కళ్యాణ్ రామ్ లా ఆలోచిస్తే. కాబట్టి.. నిర్మాతలు ఇకనైనా మారండి. కొత్త మార్పు కోసం కొత్త ఆలోచనలు చేయండి. ఆల్ ది బెస్ట్.