వెంటాడుతున్న విషాదాలు.. సినీ నటి దివ్య మృతి

0

ఈ ఏడాది బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నటీనటుల మరణాలు బీ టౌన్ వర్గాలను కలచివేస్తున్నాయి. యంగ్ హీరో సుశాంత్ మరణం నుంచి కోలుకోక ముందే ఇంకొందరు నటుల మరణ వార్తలు వినాల్సివస్తుండటం జీర్ణించుకోలేక పోతున్నారు ప్రేక్షకులు. నిన్ననే (ఆదివారం) నటుడు రంజన్ సెహగల్ మరణవార్తతో బాలీవుడ్ లోకంలో విషాదఛాయలు అలుముకోగా, తాజాగా మరో నటి దివ్య చౌక్సే కన్నుమూశారని తెలియడం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి, సింగర్ దివ్య చౌక్సే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా కేన్సరుతో బాధపడుతున్న ఆమె కన్నుమూశారు. దివ్య చౌక్సే మృతిని ఆమె బంధువు సౌమ్యా అమిష్‌వర్మ తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. కాగా తన మరణానికి కొన్ని గంటల ముందు దివ్య చౌక్సే హృదయ విదారక పోస్టు పెట్టడం కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మరణ మంచం మీద ఉన్నాను. బాధ లేని మరొక జీవితంలో కలుద్దాం. దివ్య చౌక్సే బై ’’ అంటూ ఈ పోస్టులో ఆమె పేర్కొంది.

దివ్య చౌక్సే మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివ్య మృతిపై స్పందించిన సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ”మీ అభిరుచి, కల, సినీపరిశ్రమ పట్ల మీ సానుకూలత మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి… మీ ఆత్మకు శాంతి చేకూరుగాక” అని ఆయన పేర్కొన్నారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ సినిమాలో నటించిన ఆమె.. పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో కూడా నటించింది.