ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ బాలీవుడ్ హీరోయిన్లు

0

హథ్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యూపీ పోలీసులు ప్రభుత్వ నిర్లక్యం ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన యూపీ సీఎం యోగి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. హథ్రాస్ వ్యవహారంపై యూపీలోని అధికార బీజేపీపై విమర్శలు తగ్గక ముందే యూపీలోని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పాలని అప్పుడే ఈ దేశంలో అత్యాచారాలు తగ్గుతాయని సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సురేంద్ర సింగ్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సెలబ్రిటీలు విమర్శలు గుప్పించారు.

సురేంద్ర సింగ్ వ్యాఖ్యలనుపై పలువురు బాలీవుడ్ నటీమణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సురేంద్ర వ్యాఖ్యలను బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఖండించింది. సురేంద్ర సింగ్ ఓ అసహ్యకరమైన ముసలి పాపి అని ఉన్నావ్ అత్యాచార ఘటన సమయంలోనూ ఈ మహానుభావుడు ఇటువంటి కామెంట్లు చేశాడని ఆనాటి వీడియోను షేర్ చేసింది. అత్యాచారానికి గురవకుండా ఎలా ఉండాలో కూతుళ్లకు నేర్పాలని చెబుతున్నాడని అతడు చెప్పే విషయం అతడికైనా అర్థమైందా అని హీరోయిన్ కృతి సనోన్ విమర్శించింది. ఇలాంటి ఆలోచనా ధోరణులు మారాలని కొడుకులకు సంస్కారం నేర్పాలని ఈ నేతలు ఎందుకు చెప్పరు అని ప్రశ్నించింది. అధికార పార్టీలో ఇలాంటి మూర్ఖులు పురుషాహంకారులు చాలా మంది ఉన్నారని అధికార పార్టీ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందని పూజా బేడి ట్వీట్ చేసింది.