టీడీపీ నాయకుల్లో ఊపు తెస్తున్న బోయపాటి

0

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ న్యూస్ ఛానెల్ పెట్టినా ఏ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ పెట్టినా కూడా తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో కమర్షియల్ యాడ్స్ కంటే తెలుగు దేశం యాడ్స్ ఎక్కువ అయ్యాయి. ఆ యాడ్స్ క్వాలిటీ పరంగా రీ రికార్డింగ్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి నటీనటులను ఎంపిక చేయడంతో పాటు – మంచి స్క్రీన్ ప్లే – కెమెరా వర్క్ తో యాడ్స్ ఉండటం అందరిని ఆకర్షిస్తోంది. తెలుగు దేశం పార్టీ యాడ్స్ తో ఆ పార్టీలో జోష్ పెరిగింది.

ఇంత క్వాలిటీతో తెలుగు దేశం పార్టీకి యాడ్స్ చేస్తున్నది మరెవ్వరో కాదు యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. పదుల సంఖ్యలో తెలుగు దేశం పార్టీకి యాడ్స్ ను చేశాడు. రామ్ చరణ్ కు వినయ విధేయ రామ వంటి అట్టర్ ఫ్లాప్ చెత్త సినిమాను ఇచ్చినా కూడా తెలుగు దేశం పార్టీకి మాత్రం బోయపాటి మంచి యాడ్స్ ను ఇస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన యాడ్స్ ఒక ఎత్తు అయితే ఎన్నికలు వారం రోజులు ఉండగా టీడీపీ వదలబోతున్న యాడ్ ఒక ఎత్తు ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

ఏపీకి ప్రధాని చేసిన మోసం ఏపీ ప్రజలను కేంద్రం మోసగించిన తీరుతో రెండు నిమిషాల నిడివి కలిగిన యాడ్ ను రూపొందించారట. అందులో మోడీ ఎన్నికల ప్రచారంలో మాటలు ఆ తర్వాత మాటలు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో మట్టి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్న క్లిప్స్ ఇలా ఏపీకి మోడీ చేసిన అన్యాయం కేంద్రంపై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలతో బోయపాటి ఒక మంచి యాడ్ ను తయారు చేశాడట. ఆ యాడ్ చూస్తే ప్రతి ఏపీ పౌరుడు కూడా పిడికిలి బిగించి తెలుగు దేశం పార్టీకి ఓటు వేసేలా ఆ యాడ్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా ఆ ప్రకటనలు వేయనున్నారట. మొత్తానికి సినిమాల విషయం పక్కన పెడితే బోయపాటి పొలిటికల్ యాడ్స్ తో దుమ్ము రేపుతున్నాడు. ఈ ఎన్నికల హడావుడి అయిన తర్వాత బాలయ్య బాబుతో బోయపాటి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer