చిన్న నాటి స్నేహితుడికి బన్ని బంపరాఫర్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా కథలు వింటూ దర్శకుల్ని లాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు `పుష్ప` కోసం ప్రిపరేషన్స్.. ఫిజికల్ ఫిట్ నెస్ వర్కవుట్లు.. మరోవైపు స్క్రిప్టులు వినడం ఇదే అతడి వరుస. ఇప్పటికే ఇద్దరు దర్శకుల్ని ఫైనల్ చేసాడు. వరుసగా సూపర్ డూపర్ హిట్లు తీస్తున్న కొరటాలకు కమిటయ్యాడు. ఆచార్య తర్వాత తనతోనే సినిమా తీయాలని కొరటాలకు బన్ని కండీషన్ పెట్టాడని గుసగుస.

చిరంజీవితో కొరటాల `ఆచార్య` కోవిడ్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతకంతకు షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్ లో కొరటాలకు బన్ని కమిటయ్యాడు. ఈ మూవీ కోసం స్క్రిప్టు రెడీ అవుతోంది. మరో ఆసక్తికర విషయం తాజాగా రివీలైంది.

ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 (జీఏ2) బ్యానర్ లో బన్ని చిన్ననాటి స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తారని సమాచారం. సుధాకర్ మిక్కిలినేని టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. కొరటాలకు మంచి స్నేహితుడు. ఇప్పుడు ఆ ఇద్దరి కామన్ ఫ్రెండ్ అయిన మిక్కిలినేని జీఏ2 బ్యానర్ లో సినిమా నిర్మిస్తున్నారన్నమాట. ఒక రకంగా బాల్య స్నేహితుడికి ఇది బంపరాఫరేనని భావించాలి.

జీఏ2 బ్యానర్ అంటే బన్ని వాసు ఒక నిర్మాతగా కొనసాగుతారన్న సంగతి విధితమే. స్క్రిప్టు విభాగంలో అల్లు అరవింద్ సహకారం సూచనలు ఉంటాయి. ఈ బ్యానర్ లో 100 పర్సంట్ లవ్- గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కాయి. నవతరం హీరోలు.. డైరెక్టర్లకు మంచి అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఇందులో బన్ని లాంటి స్టార్ హీరో.. కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ మిక్కిలినేనితో సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.