క్రియేటివిటీలో నేటితరాన్ని ఢీకొడతారా?

0

కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు కృష్ణవంశీ. సింధూరం- నిన్నే పెళ్లాడుతా- మురారి- అంతఃపురం- చందమామ- ఖడ్గం ఇలా చెప్పుకునేందుకు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లో అంతే చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఫేడవుట్ అన్న ముద్ర పడిన తర్వాత తిరిగి ఎన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. గోవిందుడు అందరివాడేలే- పైసా- నక్షత్రం .. ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి. కృష్ణవంశీ పనైపోయింది అన్న ప్రచారం సాగడం కూడా ఆయన పనితీరుపై బహుశా ప్రభావం చూపించి ఉండొచ్చు. ఇక ప్రతి దర్శకుడికి ఒక సీజన్ ఉంటుంది. అది అయిపోయాక తిరిగి కంబ్యాక్ అవ్వాలన్నా సాధ్యపడదని కొందరు విశ్లేషిస్తుంటారు.

అయితే ఈ క్రియేటివ్ డైరెక్టర్ సమర్ధతను పాజిటివ్ గా చూస్తే.. తెలుగు సినీపరిశ్రమలో ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలతో అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్ తో బ్లాక్ బస్టర్ మ్యాజిక్ చేసిన పనిమంతుడిగానూ ఆయనకంటూ ప్రత్యేకించి అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి అభిమానుల్ని ఆ నిరాశ నుంచి బయటపడేసే సినిమా చేయడంలోనే కృష్ణవంశీ పదే పదే తడబడుతున్నారు. ఇక ఆయనపై ఫేడవుట్ అన్న ముద్రపడే క్రమంలోనే నవతరం దర్శకుల్లోనూ క్రియేటివ్ జీనియస్ లు పుట్టుకురావడంతో ఒకరకంగా ఆయన నుంచి అవకాశాలు దూరమయ్యాయని విశ్లేషించవచ్చు.

అందుకే ఈ నాలుగేళ్లలో ఈ క్రియేటివ్ జీనియస్ స్ట్రగుల్ ఏంటో తెలిసిందే. ఓ స్టార్ హీరో చుట్టూ రెండేళ్లుగా తిరిగినా పనవ్వలేదు. మరో ఇద్దరు స్టార్ హీరోల్ని కలిసినా రేపు మాపు అంటూ ముఖం చాటేశారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఎట్టకేలకు ఓ సినిమా చేసే ఛాన్స్ దక్కింది. అది కూడా ఈసారి రీమేక్ సినిమాతో లక్ చెక్ చేసుకుంటున్నారు. `రాజ మార్తాండ` అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం మరాఠా సూపర్ హిట్ నటసామ్రాట్ కి రీమేక్. తాజాగా హైదరాబాద్ లో సినిమా మొదలైంది. ఇక ఈ సినిమా కథాంశం పరిశీలిస్తే ఎంతో ఆసక్తికరం. పదవీ విరమణ పొందిన ఒక థియేటర్ ఆర్టిస్టు తన గతాన్ని మర్చిపోవడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా. మరపురాని కష్టాల్ని మర్చిపోయేందుకు కళాకారుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు అన్నది చూపిస్తున్నారు. ఈ చిత్రంలో మరాఠా ఫేమస్ నటి మేధా మంజ్రేకర్ చేసిన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారు. అలాగే ది గ్రేట్ పెర్ఫామర్ నానా పటేకర్ పోషించిన పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేటి తరం దర్శకులతో పోటీపడుతూ .. స్క్రీన్ ప్లే పరంగా గ్రిప్పింగ్ నేరేషన్ తో కృష్ణ వంశీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈసారి తడబడితే ఇక మరో ఛాన్స్ లేనట్టే. ఇక ఇదే చిట్టిచివరి అవకాశం అని చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ ఛాలెంజ్ ని సదరు సీనియర్ ఎలా టేకప్ చేస్తారు? తన సతీమణి రమ్యకృష్ణ ఈ ప్రాజెక్టు కోసం అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు కాబట్టి ఈసారైనా లక్ కలిసొస్తుందా అన్నది చూడాలి.
Please Read Disclaimer