వీణ స్టెప్ తో మెగాస్టార్ ని మరిపిస్తాడా?

0

`దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ` ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. 15 ఏళ్ల క్రితం అదో సిగ్నేచర్ మూవ్ మెంట్. ఇంద్ర చిత్రంలోని ఈ పాట ప్రతిచోటా మార్మోగేది. చిరు అభిమానులు రికార్డింగ్ డాన్సుల్లో ఓ రేంజులో మోతెక్కించేవారు. బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల్లో యంగ్ ట్యాలెంట్ ఈ పాటకు స్టెప్పులేసేందుకు ఆసక్తిని కనబరిచేవారు. ఈ మూవ్ మెంట్ గురించి.. ఆ పాట గురించి తెలియని అభిమాని లేడు. అప్పట్లో ఈ గీతం ఓ ట్రెండ్ సెట్టర్. అయితే సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఈ స్టెప్ ను మళ్లీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రీక్రియేట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం సల్మాన్ భాయ్.. ప్రభుదేవా దర్శకత్వంలో `దబాంగ్-3`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఓ పాట కోసం వీణ స్టెప్ ను ప్రభుదేవా సలహా మేరకు సల్మాన్ రీక్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా ఐడియాను సల్మాన్ ఎంతగానో ఇష్టపడి రీక్రియేట్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడట. మరి ఆ స్టెప్ లో చిరు చూపించినంత గ్రేస్ సల్మాన్ భాయ్ చూపిస్తాడో లేదో? చూడాలి.

ఇక మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ భాయ్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీతో సల్మాన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అతడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరంజీవి- రామ్ చరణ్ లను కలుస్తుంటాడు. చిరంజీవితో ఉన్న స్నేహం కారణంగానే రామ్ చరణ్ మంచి స్నేహితుడయ్యాడు. మరి చిరు సిగ్నేచర్ స్టెప్ ని సల్మాన్ రీక్రియేట్ చేస్తున్నాడు అన్న విషయం మెగాస్టార్ కి తెలిస్తే ఆయనకంటే ఎక్కువగా సంతోషించేవాళ్లు ఎవరుంటారు.. దబాంగ్ -3 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ- తెలుగు- తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Please Read Disclaimer