భారతీయుడు-2 ఉంది.. ఇదిగో రుజువు

0

భారతీయుడు-2.. చాలా ఏళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా. ఎట్టకేలకు గత ఏడాది చివర్లో పట్టాలెక్కడంతో శంకర్ – కమల్ హాసన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ షూటింగ్ మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే సినిమాకు బ్రేక్ పడింది. కమల్కు మేకప్ పడలేదన్నారు.. బడ్జెట్ సమస్యలన్నారు.. కమల్ ఎలక్షన్ కమిట్ మెంట్స్ వల్ల బ్రేక్ తీసుకున్నాడన్నారు.. ఇలా షూటింగ్ ఆగడానికి కారణాలు చాలానే వినిపించాయి. ఐతే షూటింగ్ ఆగి ఏడెనిమిది నెలలు గడిచినా ఉలుకూ పలుకూ లేకపోవడం – ఎన్నికల హంగామా ముగిసి కమల్ ఖాళీ అయ్యాక కూడా షూటింగ్ ఆరంభం కాకపోవడం – శంకర్ వేరే ప్రాజెక్టు మీదికి వెళ్తున్నాడని ప్రచారం జరగడంతో ‘భారతీయుడు-2’ ఇక ముందుకు కదలకపోవచ్చని ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాన్ని ఖండించకుండా కొన్ని నెలలుగా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కూడా సైలెంటుగా ఉండటంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ఐతే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమాలో కదలిక వచ్చింది. త్వరలోనే షూటింగ్ పున:ప్రారంభం కానుందని సంకేతాలిచ్చింది లైకా సంస్థ. ‘భారతీయుడు-2’లో నటించడానికి నటీనటులు కావాలని – వయసుతో నిమిత్తం లేకుండా నటనలో శిక్షణ పొందిన వాళ్లు సంప్రదించాలని ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చారు లైకా వాళ్లు. సేనాపతి ఖాకీ చొక్కా బ్యాగ్రౌండ్ లో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. కమల్ – శంకర్ల పేర్లూ పోస్టర్ మీద కనిపించాయి. కాబట్టి ‘భారతీయుడు-2’కు బ్రేక్ పడలేదని – త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుందని స్పష్టమైంది.
Please Read Disclaimer