‘చక్ర’ ట్రైలర్ టాక్

0

హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘చక్ర’. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు రెజీనా కసాండ్ర శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. కాగా ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ ను హీరో రానా దగ్గుబాటి.. తమిళ ట్రైలర్ ను హీరోలు కార్తి మరియు ఆర్య.. మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్.. ఇక కన్నడ ట్రైలర్ రాకింగ్ స్టార్ యశ్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రిలీజ్ చేసారు.

సైబర్ హ్యాకర్ – బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఉన్న ‘చక్ర’ ట్రైలర్ ”ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్ లో ఉంటుంది కానీ ఆ రోజు..” అని విశాల్ వాయిస్ ఓవర్ తో మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ఇండియాలో మిలిటరీలో విశిష్టమైన కృషి చేసిన వారికి ఇచ్చే ‘అశోక చక్ర’ మెడల్ చోరీకి గురైనట్లు చూపించారు. ”ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసర్చ్ కంటే.. ఓ సగటు మనిషి అవసరాలు వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీసర్చే ఎక్కువ అంటారు” అని విశాల్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ట్రైలర్ వచ్చే డైలాగ్స్ ”కచ్చితంగా మనం వెతికే క్రిమినల్ మన కంటికి కనిపించడు” ”ఇప్పుడే కదా వేడెక్కింది.. ది గేమ్ బిగిన్స్” ”కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్ లెస్ నెట్ వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్ కమ్ టు డిజిటల్ ఇండియా” వంటివి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ”నేషనల్ సెక్యూరిటీ అనేది డిజిటల్ ఇండియా యొక్క కల” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ కూడా జత చేసారు.

‘చక్ర’ ట్రైలర్ చూస్తుంటే విశాల్ సూపర్ హిట్ మూవీ ‘అభిమన్యుడు’ తరహా హ్యాకింగ్ – బ్యాంక్ రాబరీ – సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందిందని అర్థం అవుతోంది. ఇక దీనికి యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మిలటరీ ఆఫిసర్ గా విశాల్ ఎంట్రీ స్టైలిష్ గా ఉంది. శ్రద్దా శ్రీనాథ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించింది. ఇంట్రెస్టింగ్ గా సాగిన ‘చక్ర’ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
Please Read Disclaimer